జర్నలిస్టుల సమస్యలపై 27 న ” ఛలో పార్లమెంట్ “
– జంతర్ మంతర్ వద్ద ఒక రోజు ధర్నా
– పోస్టర్ ఆవిష్కరించిన టీడబ్ల్యూజేఎఫ్
హైదరాబాద్, జూలై 22, ( అద్దం న్యూస్ ) : కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాల్సిన జర్నలిస్టుల సమస్యల పై ఈ నెల 27 వ తేదీన ” ఛలో పార్లమెంట్ ” కార్యక్రమం చేపడుతున్నట్లు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర నాయకులు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ హైదర్‌గూడలోని న్యూస్ సర్వీస్ సిండికేట్ ( ఎన్ఎస్ఎస్ ) లో జరిగిన మీడియా సమావేశంలో ఫెడరేషన్ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ లు ఛలో పార్లమెంట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుతున్నందున దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి, పార్లమెంట్ సభ్యుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని కోరుతూ ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలో పరిష్కరించాల్సిన జర్నలిస్టుల రైల్వే రాయితీ పాస్ ల పునరుద్దరణ, జర్నలిస్టుల రక్షణకు పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేయడం, రిటైర్డ్ జర్నలిస్టులకు జాతీయ పెన్షన్ పథకం, జాతీయ మీడియా కమీషన్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్ మీడియా, డిజిటల్ మీడియాకు చట్టబద్దత వంటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ డిమాండ్ల సాధనకై 27న ఢిల్లీలోని పార్లమెంట్ ( జంతర్ మంతర్ ) వద్ద ఒక రోజు ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశ వ్యాప్తంగా మీడియా రంగం విస్తరించిన నేపథ్యంలో వివిధ సమస్యలను పరిష్కరించేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మీడియా కమీషన్‌ను ఏర్పాటు చేయాలని వారు కోరారు.
అనేక రాష్ట్రాలలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, హత్యలు, అక్రమ కేసులు వంటి వాటిని అరికట్టేందుకు పార్లమెంట్ లో ” జర్నలిస్టుల రక్షణ చట్టం ” తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా పాత్రికేయ సంఘాలకు, జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలకు ప్రభుత్వ భూముల కేటాయింపును నిరాకరిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించి, దేశ వ్యాప్తంగా పాత్రికేయులకు ఇళ్ళస్థలాలు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ డిమాండ్ల సాధనకై 27న జరిగే ” ఛలో పార్లమెంట్ ” కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జర్నలిస్టులు, టీడబ్ల్యూజేఎఫ్ బాధ్యులు పాల్గొంటారని, అదే విధంగా ఢిల్లీ, యూపీ తదితర రాష్ట్రాలకు చెందిన ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ( ఐఎఫ్‌డబ్ల్యూజే ) నాయకులు కూడా ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. ధర్నా అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో ఫెడరేషన్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కె.పాండురంగారవు, పి. అశోక్ కుమార్ గౌడ్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి.రవికుమార్, రంగారెడ్డి జిల్లా కో–కన్వీనర్ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply