విజయ్ ‘జననాయగన్’కు ఊరట..
సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని కోర్టు ఆదేశాలు
అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విజయ్ (Vijay) కథానాయకుడిగా నటించిన ‘జన నాయగన్’ సినిమాకు ఊరట లభించింది. ఈ సినిమాకు (Jana Nayagan Movie) యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డుకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం తీర్పు వెలువరించింది. గత డిసెంబరులో సెన్సార్ కోసం జన నాయగన్ (Jana Nayagan) సినిమాను పంపగా అభ్యంతరకరమైన సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలు మ్యూట్ చేయాలని సూచించినట్లు సమాచారం. ఆ మేరకు మార్పులు చేసిన నిర్మాణ సంస్థ మళ్లీ సెన్సార్‌కు పంపగా బోర్డు నుంచి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో కేవీఎన్ ప్రొడక్షన్ తరఫున మద్రాసు హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది. తొలుత యూ/ఏ సర్టిఫికేషన్‌కు సిఫార్సు చేసిన సెన్సార్ బోర్డు.. ఆ తర్వాత సినిమాను రివ్యూ కమిటీకి పంపిందని నిర్మాణ సంస్థ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
దీనిపై వాదనలు విన్న హైకోర్టు బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో జనవరి 9న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. తాజాగా సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ‘జననాయగన్’ విడుదలకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ క్రమంలోనే సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోన్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమాలో పూజా హెగ్డే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
















Leave a Reply