గుంపు మేస్త్రీకో హఠాకే… తెలంగాణాకో బచానా
– తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మే 22, ( అద్దం న్యూస్ ) : గుంపు మేస్త్రీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలు ఆగమవుతున్నాయని, అందుకే గుంపు మేస్త్రీకో హఠాకే… తెలంగాణాకో బచానా అని తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం ధర్నా జరిగింది. హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద జరిగిన ఈ ధర్నాకు మద్దతు తెలిపిన కవిత కార్మికులనుద్ధేశించి మాట్లాడారు. సెంట్రింగ్ కార్మికులు అడుగుతున్న వాటిలో గొంతెమ్మ కోరికలు ఏమీ లేవని, 12 అంశాలతో చాలా చిన్న విషయాలే అడుగుతున్నారని, వారికి ఈఎస్ఐ కార్డులు, స్క్వేర్ మీటర్‌కు 51 రూపాయలు, కార్మికులు చనిపోతే ఇచ్చే డబ్బులు పది నుంచి 20 లక్షలు అడుగుతున్నారని కవిత పేర్కొన్నారు. ఇప్పుడు మేస్త్రీలు స్వ్కేర్ ఫీట్‌కు 4 వందలు అడుగుతున్నారని చెబుతున్నారని..దానిలో సెంట్రింగ్ కార్మికుల వాటా ఎంతో కూడా చెప్పాలి ? అని డిమాండ్ చేశారు. మేస్త్రీల చేతిలో ఎట్టి పరిస్థితుల్లో మీ జుట్టు ఉండకూడదని, తెలంగాణ రక్షణసేన అధికారంలో వచ్చిన తర్వాత మీ అన్ని డిమాండ్లను తీరుస్తామని హామీనిచ్చారు. ప్రతి మండలంలో సెంట్రింగ్ కార్మికుల సంఘాలు ఏర్పాటు కావాల్సి ఉందని, 186 చోట్ల వెయ్యి నుంచి 2 వేల గజాల స్థలం మీకు ఇస్తామని కవిత హామీనిచ్చారు. హైదరాబాద్‌లో అద్దాల మేడలు కనిపిస్తున్నాయంటే దానిలో సెంట్రింగ్ కార్మికుల కృషి ఎంతో ఉందన్నారు.
తాళ్లు కట్టుకొని ప్రాణాలు పణంగా పెట్టి గాలిలో వేలాడుతూ మీరు పని చేస్తున్నారని, సెంట్రింగ్ కార్మికులు లేకుంటే అద్దాల మేడాలు ఉండవు కానీ, బిల్డింగ్ లు నిర్మించే అగ్రిమెంట్లో మాత్రం మీ పేరు పెట్టటం లేదన్నారు. 2 లక్షల రూపాయల పని కోసం మీరు వెళ్తున్నప్పటికీ మీతో పాటు 15 లక్షల రూపాయల మెటీరియల్ తీసుకెళ్తున్నారని, కానీ మీ మెటీరియల్‌కు కనీసం రక్షణ లేని పరిస్థితి ఉందన్నారు. హైడ్రా వచ్చిన తర్వాత నోటీసులు లేకుండా ఇళ్లు కూలగొడుతున్నారని, దీంతో సెంట్రింగ్ పనిచేస్తున్న మీకు ఆ ఇళ్లు కూల్చే సమయంలో మీ మెటీరియల్ నష్టపోతున్నారని కవిత తెలిపారు. దీనికి ఇంటి యాజమాని గానీ… ప్రభుత్వం గానీ మీకు పరిహారం ఇవ్వటం లేదన్నారు. 86 చోట్ల సెంట్రింగ్ కార్మికులు, కాంట్రాక్టర్లు పది రోజులుగా పని బంద్ చేశారని, కానీ మీ దగ్గర ఉన్న కూలీలను మీరు సాధుతున్నారన్నారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కరించకుంటే సెంట్రింగ్ కార్మికులతో పాటు నేను ధర్నాలో కూర్చుంటానని ఆమె స్పష్టం చేశారు. సెంట్రింగ్ కార్మికుల డిమాండ్లను పట్టించుకోకపోతే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టటం ఖాయమని కవిత అన్నారు. ఎన్ని రోజులైనా సరే సెంట్రింగ్ కార్మికుల సమస్య తీరే వరకు ప్రభుత్వం ఒత్తిడి పెంచుతానని కవిత హెచ్చరించారు. ఈ ధర్నాలో అసోసియేషన్ నాయకులు కృష్ణ, పరుశురాం, చాంద్ పాషా, విష్ణువర్థన్ తదితరులు పాల్గొన్నారు.
![]()

![]()












Leave a Reply