Saturday, September 19, 2026
No menu items!
HomeHyderabadఅవినీతి ముద్ర‌ను తొల‌గించుకోండి – అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌ట్టండి – సీఎం రేవంత్‌రెడ్డి

అవినీతి ముద్ర‌ను తొల‌గించుకోండి – అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌ట్టండి – సీఎం రేవంత్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

అవినీతి ముద్ర‌ను తొల‌గించుకోండి

– అక్ర‌మార్కుల భ‌ర‌తం ప‌ట్టండి

– సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ బ్యూరో, సెప్టెంబ‌ర్ 06, అద్దం న్యూస్ :    అవినీతికి పాల్పడుతారని సమాజం ముందు దోషిగా రెవెన్యూ శాఖ మీద పడిన ముద్రను తొలగించుకునే బాధ్యత కొత్తగా నియమితులైన గ్రామ పరిపాలన అధికారులపై ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పరిపాలన చేయలేరని, అవినీతికి పాల్పడుతారంటూ మీపై జరిగిన ప్రచారం తప్పు.. అని నిరూపించాల్సిన అవసరం ఉందన్నారు. ఎక్కడా ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా పని చేయాలని చెప్పారు. రెవెన్యూ శాఖలో కొత్తగా ఎంపికైన 5,106 మంది గ్రామ పాలనాధికారులు ( GPO ) లకు హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన ప్రజాపాలనలో కొలువుల పండుగ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా లాంఛనంగా నియామక పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఉద్యోగాల్లో నియమితులైన జీపీఓలు అందరితో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి “భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్దంగా పని చేస్తానని” ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… కొత్తగా నియమితులైన మీ పట్ల నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉందన్నారు. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రావడంలో భాగస్వాములైన మీరు, ఇప్పుడు ఏ చిన్న తప్పు చేసినా ప్రభుత్వానికి చెడ్డ పేరొస్తుందన్నారు. భూ భారతిని అమలు చేయడమే కాకుండా సాదా బైనామా సక్రమంగా అమలు చేస్తారని హామీ ఇచ్చామ‌న్నారు. పేదవాడికి న్యాయం జరగాలంటే గ్రామ పాలనాధికారులు అందుబాటులో ఉండాలని, అందుకు గాను 5 వేల పైచిలుకు గ్రామ పాలనాధికారులను నియమించామ‌ని, సాదా బైనామాకు సంబంధించి ఎనిమిది, తొమ్మిది లక్షల దరఖాస్తులు వచ్చాయని చెబుతున్నారన్నారు. ఇది ఉద్యోగం కాదు. మీ ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. ఇదొక భావోద్వేగం అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు, ఆర్టీసీ, సింగరేణి, రెవెన్యూ సిబ్బంది అత్యంత క్రియాశీలక పాత్ర పోషించారని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖల సిబ్బందిని దొంగలుగా, దోషులుగా నిలబెట్టే ప్రయత్నం జరిగిందన్నారు. తెలంగాణలో భూములకు సంబంధించి ఎన్నో సమస్యలున్నాయని, ఆ సమస్యలు పరిష్కరించడానికి వీలులేకుండా వీఆర్ఏ, వీఆర్వో, ఎంఆర్వోల నుంచి అధికారాలను తప్పించారన్నారు. తద్వారా సమాధానం చెప్పలేక మీరు సమాజంలో దోషులుగా నిలబడే పరిస్థితి కల్పించారని, ఎవరో కొందరు తప్పు చేశారని మొత్తం వ్యవస్థనే రద్దు చేస్తారా అని అన్నారు. ఆనాడు ఎవరిని కదిలించినా ఈ ధరణి అనే ఒక భూతం పట్టి పీడించిందని చెప్పారు. అధికారంలోకి రాగానే ధరణిని బంగాళాఖాతంలో విసిరేసి కొత్త చట్టాలను తెచ్చామ‌ని, ధరణి అనే మహమ్మారిని అంతం చేయడానికి నిపుణులతో ఒక కమిటీని వేశాం. భూభారతి ( BhuBharati 2025 ) చట్టం చేసి 4 కోట్ల తెలంగాణ ప్రజలకు అంకితం చేశామ‌న్నారు. ధరణి అనే వైరస్‌ను తప్పించడానికి అనేక రకాల సమాలోచనలు చేశామ‌ని, ఎంత మంది సలహాలు, సూచనలు తీసుకున్నామ‌న్నారు. రాష్ట్రంలోని 1 లక్షా 56 వేల ఎకరాల భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులను ప్రక్షాళన చేయడమే కాకుండా గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తెచ్చామ‌ని అన్నారు. భూమికి తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం అని అన్నారు.

భూమిపై జరిగిన ఏ పోరాటమైనా భూమి చుట్టే సాగాయని, నిజాంలను, రజాకార్లను, పెత్తందార్లను దిగంతాలకు తరిమికొట్టి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు జరిగిన చరిత్ర ఉందని, వీటితో పాటు భూదాన్ ఉద్యమాలు కూడా వచ్చాయన్నారు. ఇందిరాగాంధీని ఒప్పించి ఆనాడు పీవీ నరసింహారావు ల్యాండ్ సీలింగ్ చట్టం తీసుకొచ్చి 25 లక్షల ఎకరాల భూములను దళితులు, గిరిజనులు, ఆదివాసీలకు పంపిణీ చేశారని, 10 లక్షల ఎకరాల పోడు భూములపై ఆదివాసీలకు పట్టాలను ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణలో మనిషికి భూమితో ఉన్న సంబంధం తల్లికీ బిడ్డకు ఉన్న సంబంధం అని, తెలంగాణ ఉద్యమం నుంచి మొదలు 2023 నాటి వరకు చరిత్రను పరిశీలిస్తే భూములను చెరబట్టిన వారిని ప్రజలు దిగంతాల వరకు తరిమికొట్టిన చరిత్ర ఉందని అన్నారు. అనంతరం పలువురికి నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కొలువుల పండుగ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కర వేణుగోపాల రావు, ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, పీఏసీ చైర్మన్ ఆరికె పూడి గాంధీ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page