రేవంత్ రెడ్డి పాపమే రైతన్నకు శాపంలా మారింది – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

నీళ్ల మంత్రి, నల్లగొండలోనే ఉన్నా చుక్కనీరు తేలేకపోవడం సిగ్గుచేటు

⟢ పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణం

⟢ కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారు

ఎస్ఎల్‌బిసి ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేపించుకొని తిన్నాడు

⟢ ప్రతీ గ్రామం నుంచి వరంగల్ సభకు కార్యకర్తలు తరలి రావాలి

⟢ గులాబీ జెండా కప్పుకున్న ప్రతి బిడ్డ వరంగల్ రావాలి

– సూర్యాపేట కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ : కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే క‌ల్వ‌కుంట్ల తార‌క రామారావు అన్నారు. కర్కశంగా పాలిస్తున్న కాంగ్రెస్ నుంచి విముక్తి కల్పించేందుకు మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండిపోవడానికి కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువే కారణమ‌ని కెటిఆర్ ధ్వ‌జ‌మెత్తారు. కేసీఆర్ మీద ఉన్న గుడ్డి ద్వేషంతో మేడిగడ్డ చిన్న పర్రెను రిపేరు చేయించకుండా గోదావరి నీళ్లను ఆంధ్రకు వదిలేస్తున్నారని, ఎస్ఎల్‌బిసి ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేపించుకొని తిన్నాడని ఎద్దేశా చేశారు. గురువారం సూర్యాపేటలో జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జ‌గ‌దీష్‌రెడ్డితో క‌లిసి కెటిఆర్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… అధికారం పోయినా ప్రజల్లో మాత్రం టన్నుల కొద్ది అభిమానం అలాగే ఉందన్నారు. ప్రతీ తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యంగా గులాబీ జెండానే ఉందన్నారు. ఈ సంవత్సరం అంతా బీఆర్ఎస్ పోరాటనామ సంవత్సరమే అన్న కేటీఆర్, అందుకు ఏప్రిల్ 27న తొలి అడుగు పడబోతుందన్నారు. దశాబ్దాల పాటు తెలుగు వాళ్ళను మదరాసీలు అని పిలిచేదని, దాన్ని మార్చిన నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఒక పార్టీ పెట్టి భారతదేశంలో తెలుగు వాళ్ళు కూడా ఉన్నారని చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు అని పేర్కొన్నారు. ఈ దేశంలో తెలంగాణకు ఒక ప్రత్యేక అస్తిత్వం ఉందనీ, తెలంగాణ అనే పౌరుషాల గడ్డ ఉందని ఎలుగెత్తి చాటిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. భారతదేశ స్వాతంత్ర చరిత్రలో 25 ఏళ్లు విజయవంతంగా కొనసాగుతున్న అతికొద్ది పార్టీల్లో బీఆర్ఎస్ ఒకటన్నారు. కేసీఆర్ మోకాలు ఎత్తుకు కూడా సరిపోనీ వాళ్ళు ఆయన గురించి అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. వాన పాములు నాగుపాముల లెక్క బుసలు కొడుతున్నాయని, తమ స్థాయి మరచి గ్రామ సింహాలు కూడా కేసీఆర్ మీద మాట్లాడుతున్నాయని అన్నారు. 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒకవైపు, దేశాన్ని నడుపుతున్న భారతీయ జనతా పార్టీ ఒకవైపు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉంటూ ఢిల్లీలో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నాయుడు ఇంకోవైపు ఉన్నా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేసీఆర్ పార్టీ పెట్టి నడపడం ఆషామాషీ విషయం కాదన్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టిన తెలంగాణ ప్రజాసమితిని చూసిన ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందన్న నమ్మకం చచ్చిపోయిందన్నారు. కానీ 2001లో ఒక్కడిగా బయలుదేరి శూన్యం నుంచి సునామీ సృష్టించి తెలంగాణ సాధించిన మహా నాయకుడు కేసీఆర్ అని.. ఇదే చరిత్ర అని అన్నారు. కేసీఆర్ లేకపోతే గులాబీ జెండా లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల పోరాటాలకు కేసీఆర్ నాయకత్వం తోడై విజయం సాధించామ‌న్నారు.25 ఏళ్ల పార్టీ చరిత్రలో మొదటి 14 ఏళ్ల ఉద్యమ పార్టీగా విశ్వరూపాన్ని చూపించామ‌ని కెటిఆర్ తెలిపారు. ప్రజాస్వామ్య బద్దంగా తమ డిమాండ్లను నెరవేర్చుకోవచ్చని దేశ ప్రజలకు నిరూపించిన పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. అధికారంలోకి వస్తే పేదల కోసం ఎలా పనిచేయవచ్చో పదేండ్ల పాటుు చూపిస్తూ దేశంలోనే తెలంగాణను నంబర్ వన్ చేసిన నాయకత్వం కేసీఆర్ ది అని స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష పాత్రలో ప్రజల పక్షాన ఎలుగెత్తి పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ప్రతి తెలంగాణ బిడ్డకు గుండె ధైర్యం ఈ గులాబీ జెండా అని…మాకు ఉద్యమం కొత్త కాదు అధికారం కొత్త కాదు ప్రతిపక్ష పాత్ర కొత్త కాదన్నారు. తిరిగి అధికారంలోకి రావాలని కోరుకోవడం మా కోసం కాదు ప్రజల కోసం అని…చరిత్రలో ఒక అనివార్యమైన సందర్భంలో బీఆర్ఎస్ పుట్టిందన్నారు. తెలంగాణ బాగు కోసం మాత్రమే మళ్ళీ అధికారం కోరుకుంటున్నామ‌న్నారు. ఫీనిక్స్ పక్షిలాగా బీఆర్ఎస్ క్యాడర్ కదం తొక్కుతున్నారని అన్నారు. ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడకుండా పోరాడుతున్న గులాబీ సైన్యానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాన‌ని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ ది ఒక వికృతమైన మనస్తత్వం :

చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి పర్సనాలిటీ పెంచుకోవడం మీద కంటే పర్సంటేజీలు పెంచుకోవడం మీదనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందని కెటిఆర్ అన్నారు. ఢిల్లీకి మూటలు పంపి పదవిని కాపాడుకునే ధ్యాస తప్ప రేవంత్ కు ఏం లేదన్నారు. అసూయ, ద్వేషం, ఆశ ఈ మూడు అంశాలే బీఆర్ఎస్ ఓటమికి కారణమ‌న్నారు. యూట్యూబ్ ను అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన సన్నాసి రేవంత్ రెడ్డి ఇవాళ అదే యూట్యూబ్ జర్నలిస్టులను బట్టలూడదీసి కొడతా అంటున్నాడని..100కు 100 శాతం రుణమాఫీ చేశామని నిరూపిస్తే మా పదవులను వదిలిపెడతామని చెప్తే ఇప్పటిదాకా ఆ సవాల్ ని కాంగ్రెస్ నాయకులు ఎవరు స్వీకరించలేదన్నారు. రైతులకు రావాల్సిన 37 వేల కోట్ల రూపాయలు ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే ఖాతాల్లో టింగు టింగు మనీ పడుతున్నాయన్నారు. కేసీఆర్ కాంగ్రెస్ సన్నాసులను నమ్మితే రైతుబంధుకి రామ్ రామ్ అయితదని ముందే చెప్పిండని అన్నారు.

నీళ్ల మంత్రి, నల్లగొండలోనే ఉన్నా చుక్కనీరు తేలేకపోవడం సిగ్గుచేటు :

నీళ్ల మంత్రి , నల్లగొండలోని ఉన్నా చుక్కనీరు తేలేకపోతున్నారని కెటిఆర్ విమ‌ర్శించారు. ఎస్ఎల్‌బిసి ప్రమాదం జరిగితే ఒక మంత్రి పోయి చాపల కూర చేపించుకొని తిన్నాడని ఎద్దేవా చేశారు. అధికారం మాత్రమే పోయింది ప్రజల్లో అభిమానం మాత్రం మాకు అలాగే ఉందన్నారు. చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది గాడిదని చూస్తేనే గుర్రం విలువ తెలుస్తుందన్నారు. అట్లనే కాంగ్రెస్ కంచర గాడిదలను చూసిన తర్వాతనే ప్రజలకు కేసీఆర్ గొప్పతనం తెలిసి వచ్చిందన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు… కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదని అడిగితే ఏ ఒక్క కాంగ్రెస్ నేత సమాధానం చెప్పడం లేదన్నారు. కేసీఆర్ కట్టిన కాలేశ్వరం నుంచి నీళ్ళు రాకపోతే మరిప్పుడు కాంగ్రెస్ కట్టిన ఎస్ఆర్ఎస్‌పి నుంచి నీళ్లు ఎందుకు రావడం లేదన్నారు.

కృష్ణానదిలో 36 శాతం నీళ్లను కేసీఆర్ ప్రభుత్వం వాడుకుంది… కానీ ఈ కాంగ్రెస్ సన్నాసుల ప్రభుత్వం 24 శాతం నీళ్లను కూడా వాడుకోలేదన్నారు. నీళ్లు వాడుకునే తెలివి లేదని, నీటిని పొదుపు చేసుకునే తెలివి లేదు.. చెరువులను నింపే తెలివి లేదు… భూగర్భ జలాలను పెంచే తెలివి లేదని కెటిఆర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ వైఫల్యాలను బిజెపి ప్రశ్నించదని… బడే భాయ్ మోడీ… చోటే బాయ్ రేవంత్ మధ్య ఆ అండర్‌స్టాండింగ్ ఉందని అన్నారు. తెలంగాణకు గొంతుగా బిఆర్ఎస్ ఉండొద్దని కాంగ్రెస్ బీజేపీల ఉమ్మడి లక్ష్యం అని అన్నారు.

కేసీఆర్ తెలంగాణ పక్షం… కాంగ్రెస్, బిజెపి ఢిల్లీ పక్షం :

రేవంత్ రెడ్డి అవినీతిని ఆధారాలతో సహా కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోవడం లేదని కెటిఆర్ అన్నారు. ఒక్కొక్క గ్రామం నుంచి బండ్లు కట్టుకుని వరంగల్ సభకు సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ప్రజలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బిజెపి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిన సందర్భం ఏప్రిల్ 27. మరొక్కసారి గులాబీ సైన్యం కదం తొక్కాలన్నారు. జగదీశ్వర్ రెడ్డి చెప్పిన ఏతుల వెంకటయ్య కథ విని కాంగ్రెస్ ప్రభుత్వానికి బర్దాష్ కాలేదని.. అందుకే ఆయనను సస్పెండ్ చేశారన్నారు. స్పీకర్ పదవికి కుల, మత పట్టింపులు ఉండవని… స్పీకర్ పదవి అంటే బీఆర్ఎస్ కు ఎంతో గౌరవమ‌ని.. ప్రసాద్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంలో మా పాత్ర కూడా ఉందన్నారు. శాసనసభ మన అందరిదీ అన్న జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తే, గాంధీభవన్ లెక్క సభను నడుపుతున్నారని అన్న అక్బరుద్దీన్ ఓవైసీ మీద చర్యలు తీసుకోలేదని కెటిఆర్ ప్ర‌శ్నించారు. మజ్లిస్ మీద చర్య తీసుకునే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా ? అని అన్నారు. పంచ పాండవుల మాదిరి ఆ కౌరవసభలో 100 మందిని ఎదుర్కొంటున్నది కేసీఆర్ గులాబీ దండు మాత్రమేన‌న్నారు.

వరంగల్ సభ తర్వాత మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభం :

వరంగల్ సభ తర్వాత మే నెలలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభమ‌వుతుంద‌ని కెటిఆర్ తెలిపారు. కొత్త కమిటీలను పటిష్టంగా నిర్మించుకుందామ‌ని… గ్రామస్థాయి వార్డు స్థాయి, బూత్ స్థాయి, రాష్ట్ర కమిటీ దాకా అద్భుతంగా కమిటీలను ఏర్పాటు చేసుకుందామ‌న్నారు. కష్టకాలంలో పార్టీనే నమ్ముకొని ఉన్న వారికే పెద్దపీట వేస్తామ‌ని… వారికే అవకాశాలు ఇస్తాం… చిన్న పెద్ద అనే తేడా పార్టీలో లేదన్నారు. పార్టీ ఆఫీసులను చైతన్య కేంద్రంగా మార్చుకొని కార్యకర్తలకు అద్భుతంగా శిక్షణ ఇస్తామ‌న్నారు. చివరి సంవత్సరంలో ఏదో ఒక పథకం ఇచ్చినట్టు చేస్తే ప్రజలు తమనే మళ్లీ గెలిపిస్తారన్న నమ్మకంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారని.. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా గులాబీ కార్యకర్తలే చెప్పాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే కేసీఆర్ లాగా ప్రతీ కార్యకర్త కథానాయకుడిలాగా విజృంభించాలని పిలుపునిచ్చారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page