విద్యా హక్కు చట్టం సెక్షన్ ( 23 ) ను సవరించాలి – STFI జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్‌

విద్యా హక్కు చట్టం సెక్షన్ ( 23 ) ను సవరించాలి  

సుప్రీం కోర్టు తీర్పు నుండి ఇన్ సర్వీస్ ‌టీచర్లకు రక్షణ కల్పించాలి

– STFI జాతీయ ప్రధాన కార్యదర్శి చావ రవి డిమాండ్‌

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 14, అద్దం న్యూస్ :   టెట్‌ పై సెప్టెంబరు 1న సుప్రీంకోర్టు ఐదేళ్ళ పైబడి సర్వీసున్న ఇన్‌ సర్వీస్‌ టీచర్లందరూ రెండేళ్ళలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష ( టెట్ ) ఉత్తీర్ణులు కావాలని లేదంటే ఉద్యోగాన్ని వదులుకోవాలని ఆదేశిస్తూ ఇచ్చిన తీర్పు నుండి సీనియర్‌ టీచర్లకు రక్షణ కల్పించాలంటే విద్యాహక్కు చట్టంలో సెక్షన్‌ 23 ను సవరించాలని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ( STFI ) జాతీయ ప్రధాన కార్యదర్శి, టిఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అదే విధంగా టెట్ సిలబస్, అర్హత ప్రమాణాలను శాస్త్రీయంగా సవరించాలని ఎన్‌సిటిఈ ని డిమాండ్ చేశారు. ఆదివారం దోమలగూడలో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఉపాధ్యాయ ఫెడరేషన్‌ రాష్ట్ర కార్యాలయం టిఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర కమిటీ సమావేశం చావ రవి అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ… ఉపాధ్యాయులు అప్ డేట్ కావటానికి తాము వ్యతిరేకం కాదని, అయితే 2010 ఆగ‌స్టు 23వ తేదీకి ముందు నియామకమైన టీచర్లకు టెట్ మినహాయింపు ఇచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు. 15 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా రెండేళ్లలో పరీక్ష పాస్ కావాలంటే సీనియర్‌ టీచర్లు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ కారణంగా ఏర్పడే సంక్షోభాన్ని నివారించడానికి తక్షణమే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేయాలని రవి కోరారు. జాతీయ విద్యా విధానం సవరించాలని, సిపిఎస్ పథకాన్ని రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని, ఆదాయ పన్ను పరిమితిని పెంచాలని, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతో నిర్వహిస్తున్న దేశవ్యాప్తం క్యాంపైన్ లో భాగస్వాములు కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

టీఎస్‌ యుటిఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్‌ మాట్లాడుతూ… ఈ రెండేళ్ల కాలంలో వీలైనన్ని ఎక్కువ పర్యాయాలు టెట్‌ పరీక్ష నిర్వహించి అవసరమైన ఉపాధ్యాయులందరూ ఉత్తీర్ణులు అయ్యేలా అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. డిగ్రీ, బిఎడ్‌ అర్హతలతో ఎస్జీటీలుగా నియామకమైన ఉపాధ్యాయులకు ఓడిఎల్ ( ఓపెన్‌ అండ్‌ డిస్టెన్స్‌ లర్నింగ్ ) పద్ధతిలో జిల్లా విద్యాశిక్షణ సంస్థ ( డైట్ ) ల ద్వారా డిఎడ్‌ స్వల్పకాలిక శిక్షణను అందించి టెట్‌ పేపర్‌ 1 వ్రాసుకోవడానికి అర్హత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.జంగయ్య, చావ దుర్గా భవాని, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, పత్రిక సంపాదకులు పి.మాణిక్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ నిధి చైర్మన్‌ ఎం.రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు సిహెచ్‌.రాములు, కె.సోమశేఖర్‌, వి.శాంతికుమారి, ఎస్‌.మల్లారెడ్డి, డి.సత్యానంద్‌, రవికుమార్‌, ఎ.సింహాచలం, బి.రాజు, వై.జ్ఞానమంజరి, ఎం.వెంకటప్ప, కుటుంబ సంక్షేమ నిధి కార్యదర్శి నాగమల్లేశ్వరరావు, మైనార్టీ, ట్రైబల్‌ వెల్ఫేర్‌ విభాగం రాష్ట్ర నాయకులు మహేష్‌, సురేందర్‌, వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల మరణించిన సిపిఐ జాతీయ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, యుటిఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జియావుద్దీన్ అహ్మద్ ల‌కు నివాళులర్పించారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page