సికింద్రాబాద్, మే 29, అద్దం న్యూస్ : సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా కోరితూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షులు గుర్రం పవన్ కుమార్, కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం లేఖ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రిజిస్టర్ పోస్ట్ లో పంపారు. 1959 వరకు ప్రత్యేక కార్పొరేషన్‌గా కొనసాగిన సికింద్రాబాద్ ను 1960 లో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనం చేయడం జరిగిందని, అప్పటి నుంచి సికింద్రాబాద్ ప్రాంతంలో వసూలైన నిధులు మరొక ప్రాంతానికి తరలి పోవడం ప్రారంభమైంది. అనంతరం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసిగా విస్తరించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఎన్ని నిధులు కేటాయించిన కూడా కేవలం అభివృద్ధి చెందుతున్న గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ ప్రాంతాలకు తరలి వెళుతున్న విషయం సికింద్రాబాద్ ప్రజల ను తీవ్ర మనస్థాపనికి గురి చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే రాను రాను సికింద్రాబాద్ మరొక పాత నగరంగా మిగిలి పోతుందనే ఆందోళన ఈ ప్రాంత ప్రజాల్లో నెలకొందన్నారు. రోడ్ల విస్తరణ, నూతన ఫ్లై ఓవర్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థను మెరుగు పరచక పోవడం, ట్రాఫిక్ క్రమబద్దీకరణకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లాంటి చర్యలు ప్రభుత్వం మమ్మలి నిర్లక్ష్యం చేస్తుందనే ఆందోళన సికింద్రాబాద్ ప్రజల్లో నెలకొందన్నారు. 2006 వ సంవత్సరంలో సికింద్రాబాద్ కు 200 సంవత్సరాలు నిండిన సందర్బంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రకటించిన 200 కోట్ల నిధుల విడుదల కూడా రాజశేఖరరెడ్డి మరణంతో మరుగున పడిందని తెలిపారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్న అవి సికింద్రాబాద్ ప్రజలకు అందడంలేదన్నారు. ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ ఏర్పాటు చేయడం, శివారు మున్సిపాలిటీలను జిహెచ్ఎంసిలో కలపడం లాంటి చర్యలు సికింద్రాబాద్ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తున్నదని పేర్కొన్నారు. సికింద్రాబాద్ ప్రజల కోరిక మేరకు సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ప్రత్యేక హోదా కేటాయించి, ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించి సికింద్రాబాద్ ప్రజలకు న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply