Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADSIR ఓటర్ల సర్వే అంతా గందరగోళం

SIR ఓటర్ల సర్వే అంతా గందరగోళం

📰 Generate e-Paper Clip

SIR ఓటర్ల సర్వే అంతా గందరగోళం.. క్షేత్రస్థాయిలో ఓటర్ల తీవ్ర పరేషాన్
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్‌ నాయకుడు నల్లెల్ల కిషోర్ తీవ్ర ధ్వజం

హైద‌రాబాద్‌,  జూలై  2, ( అద్దం న్యూస్ ) :   రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( Special Intensive Revision ) కార్యక్రమం క్షేత్రస్థాయిలో పూర్తిగా దారితప్పిందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నాయ‌కులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ… ఓటర్ల నమోదు ప్రక్రియలో అనేక అక్రమాలు, లోపాలున్నాయ‌న్నారు. ఎండగట్టారు. క్షేత్రస్థాయిలో SIR సర్వే వైఫల్యాలు – ఓటర్ల తిప్పలు – ఓటర్ల ఎన్యుమరేషన్ ప్రక్రియలో బూత్ లెవల్ అధికారులు ( BLO లు ) బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎన్యుమరేషన్ ఫారం ఇవ్వకుండానే ఇళ్లకు స్టిక్కర్లు వేస్తున్నారని, చాలా ప్రాంతాలలో కనీసం ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వకుండానే ఇళ్ల గోడలకు ఎస్ఐఆర్ స్టిక్కర్లు వేస్తూ అధికారులు మభ్యపెడుతున్నారన్నారు. నిబంధనల ప్రకారం ఫారాలు ఇచ్చి వివరాలు సేకరించిన తర్వాతే స్టిక్కర్ వేయాల్సి ఉండగా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. బీఎల్ఓలుగా విధులు నిర్వహిస్తున్న కొందరు బిల్ కలెక్టర్లు, టాక్స్ ఇన్‌స్పెక్టర్లు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లు నేరుగా ఇళ్లకు వెళ్లకుండా తమకు తెలిసిన ప్రైవేట్ వ్యక్తులతో సర్వే చేయిస్తున్నారని పేర్కొన్నారు. తమ అధికారిక లాగిన్ ఐడీలు, పాస్‌వర్డ్‌లను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి సర్వే చేయిస్తున్న ఉదంతాలు శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కూకట్‌పల్లి నియోజకవర్గాల్లో వెలుగుచూడటం దారుణమ‌న్నారు.

గదిలోనే కూర్చుని ” డోర్ లాక్ ” నమోదు… పలు ప్రాంతాల్లో ఇళ్లకు తాళాలు వేసి ఉండటం లేదా ఓటర్లు అందుబాటులో లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని, కొందరు బీఎల్ఓలు అసలు ఆయా ప్రాంతాలకే వెళ్లకుండా యాప్‌లో డోర్ లాక్, చిరునామా మారారు అని తప్పుడు వివరాలు నమోదు చేస్తున్నారని అన్నారు. ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ, వాటిని పూరించడంలో సామాన్య ఓటర్లు అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బీఎల్ఓలు గంప గుత్తగా ఎన్యుమరేషన్ పత్రాలను స్థానిక ప్రజాప్రతినిధులకు, రాజకీయ నాయకులకు అందజేస్తున్నారన్నారు. కొన్ని ప్రాంతాలలో ఓటర్లకు తెలుగులో ముద్రించిన ఫారాల వల్ల వివరాలు నమోదు చేయలేక తిప్పలు పడుతున్నారని తెలిపారు. యాప్‌లలో వివరాలు నమోదు చేసేటప్పుడు 2002 నాటి వయసుకు, ప్రస్తుతానికి 22-23 సంవ‌త్స‌రాల వ్యత్యాసం ఖ‌చ్చితంగా సరిపోలితేనే యాప్ అంగీకరిస్తోంది, లేదంటే తిరస్కరిస్తూ ఓటర్లను అయోమయంలో పడేస్తోందని అన్నారు. బీఎల్ఓలకు సరైన అవగాహన లేదని, ప్రభుత్వ విధుల్లో ఉండటం వల్ల చాలామంది శిక్షణకు రాలేదు, హాజరైన వారికి ఫారాలు నింపడంపై స్పష్టత లేదన్నారు. ఓటర్లు సందేహాలు అడిగితే తప్పులున్నాయంటూ ఫారాలను తిరస్కరిస్తున్నారు తప్ప సరిగా చెప్పడం లేదని విమ‌ర్శించారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఈ అవకతవకలపై తక్షణమే సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. బీఎల్ఓల లాగిన్ ఐడీలను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన నిందితులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, భాషా సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ఆయా భాషల్లో ( ఇంగ్లీష్, హిందీ ) ఫారాలను అందుబాటులో ఉంచాలన్నారు. ఏ ఒక్క అర్హుడైన ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోకుండా, గడువు ముగిసేలోగా ఈ నెల 24 వ తేదీ వ‌ర‌కు ఇంటింటికీ వెళ్లి పారదర్శకంగా సర్వే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున నల్లెల్ల కిషోర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు కాసుల సుదర్శన్ రెడ్డి, తడక వినోద్ నేత, శ్యామ్ సుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, అనిల్ కురుమ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page