ప్రత్యేక నిధులు కేటాయించి, తెలుగు భాషను కాపాడే ప్రయత్నం చేయాలి
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, ఆగస్టు 29, అద్దం న్యూస్ : తెలుగు భాషకు ప్రత్యేక నిధులు కేటాయించి సాంస్కృతిక శాఖ ద్వారా తెలుగు భాషను కాపాడే ప్రయత్నం చేయాలని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. శనివారం హైదరాబాద్ దోమలగూడలోని నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ప్రతి సంవత్సరం ఆగస్టు 29 న తెలుగు కవి భాషా ఉద్యమ నాయకుడు “ గిడుగు వెంకట రామమూర్తి ” జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. తెలుగు భాషను గ్రాంధికం నుండి ప్రజలు మాట్లాడే వాడుక ( వ్యవహారిక ) భాషలోకి మార్చడానికి ఆయన కృషి చేశారన్నారు. దేశ భాషలందు తెలుగు లెస్స అన్న ఆంధ్రభోజ శ్రీ కృష్ణ దేవ రాయల అడుగు జాడల్లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్‌టి రామారావు ఉన్నప్పుడు తెలుగును అధికార భాషగా గుర్తించి, తెలుగు భాషకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారన్నారు. ఎన్‌టిఆర్ ఏ పథకం చేపట్టినా తెలుగు భాషను బ్రతికించుకోవాలనే ఉద్దేశంతో తెలుగు అనే పదంతో మొదలు పెట్టేవారన్నారు. తెలుగు గంగ, తెలుగు లలితకళా తోరణం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిధ్యాలయం, తెలుగు కళామూర్తుల నిక్షిప్త ప్రాంగణం ఇలా సాధ్యమైనంత వరకు తెలుగుకు ప్రోత్సాహమిచ్చారు. దేశంలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడే తెలుగు భాషను నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని సాయిబాబా వాపోయారు.
భాష అంటే మన శ్వాస అనే విధంగా చంద్రబాబు నాయుడు కూడా ఎన్‌టిఆర్ ఆశయాలను కొనసాగిస్తూ తెలుగు కోసం పాటు పడ్డారన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తెలుగును చిన్నాభిన్నం చేస్తూ, కనీసం తెలుగు భాషను పట్టించుకునే పరిస్థితే లేదన్నారు. పాలకుల పుణ్యమా అన్నట్లు తెలుగు పూర్తిగా నిర్లక్ష్యం చేయబడుతుందన్నారు. యధా రాజా తధా ప్రజా అన్నట్లుగా ప్రజలు కూడా తెలుగులో విస్మరిస్తున్నారని, తెలుగు మాట్లాడితే తెలివి తక్కువ వాడు అన్న తీరుగా ప్రజల్లో భావం ఏర్పడిందని, చిన్నచూపుగా చూస్తున్నారన్న భావంతో తెలుగు పూర్తిగా అంతరించే ప్రమాదం ఏర్పడిందని అన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply