Monday, September 21, 2026
No menu items!
HomeTelanganaముఖ్య‌మంత్రి మాదిగ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిలబెట్టుకోవాలి

ముఖ్య‌మంత్రి మాదిగ‌ల‌కు ఇచ్చిన మాట‌ను నిలబెట్టుకోవాలి

📰 Generate e-Paper Clip

 

హైద‌రాబాద్‌, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండకుండా ఎస్సీ వర్గీకరణ లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ అన్నారు. శ‌నివారం ఎంఆర్‌పిఎస్ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం ఇన్‌చార్జ్‌ గజ్జల రాజశేఖర్ మాదిగ ఆధ్వర్యంలోహైదరాబాద్‌ బాగ్‌లింగంప‌ల్లి అంబేద్కర్ విగ్రహం నుంచి సుందరయ్య పార్క్ వరకు ఎమ్మార్పీఎస్ నాయ‌కులు నిరసన ప్రదర్శనను నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నరేష్ మాదిగ హాజ‌రై మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఆగస్టు 1 న ఇచ్చిన తీర్పును స్వాగతించిన ముఖ్యమంత్రి ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్‌కు ఎస్సీ వర్గీకరణను వర్తింప చేస్తామని అసెంబ్లీలో హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీని అమల్లోకి తీసుకురాకుండా టీచర్ ఉద్యోగాలను భర్తీ చేసి మాదిగలకు అన్యాయం చేశారన్నారు. ఒకవైపు 17వ తేదీన అసెంబ్లీలో చట్టం చేస్తామని చెబుతూనే మరోవైపు వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల చేస్తూ రేవంత్‌రెడ్డి ధ్వంద‌ వైఖరిని అవలంభిస్తున్నారని అన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు చేతలకు పొంతన లేదని అన్నారు. ఎస్సీ రిజర్వ్‌డ్ ఉద్యోగాలన్నీ మాల సామాజిక వర్గానికి దోచిపెట్టడానికే రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని విమ‌ర్శించారు. ఇప్పటికే ఉద్యోగాల్లో తీవ్రంగా నష్టపోయిన మాదిగలకు మరొకసారి గ్రూప్ -1, గ్రూప్ -2, గ్రూప్ – 3 ఉద్యోగాల్లో అన్యాయం చేయాలని చూడడం అనేది దుర్మార్గమైన చర్య అని అన్నారు. వెంటనే రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట కట్టుబడి అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఆమోదించాలని డిమాండ్ చేశారు. ఆ చట్టాన్ని వెంటనే అమలులో తీసుకురావాలని, వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ అవకాశాలన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను అమల్లోకి తీసుకువచ్చేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ బొర్రా బిక్షపతి, జిల్లా అధ్యక్షుడు టీవీ నరసింహ, అధికార ప్రతినిధి డప్పు మల్లికార్జున్, సీనియర్ నాయకులు గండి కృష్ణ, చిలక ఎల్లయ్య, రాంన‌గ‌ర్ డివిజ‌న్ అధ్య‌క్షుడు రాములు మాదిగ‌, గోపి మాదిగ‌, శ్రీనివాస్ మాదిగ‌, ద‌శ‌ర‌థ్ మాదిగ‌, ఎల్ల‌య్య మాదిగ‌, సాయిలు మాదిగ‌, గంగాధ‌రి మ‌హేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page