హైదరాబాద్, జూన్ 11, అద్దం న్యూస్ : ఇటీవలే మెట్రోరైలు చార్జీలు పెంచిన ప్రభుత్వం గోరు చుట్టుపై రోకటి పోటులా ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభంలోనే బస్ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డిని ప్రభుత్వం విరించిందని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా అన్నారు. బుధవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… ప్రజల కోసం పని చేయాల్సిన ప్రభుత్వాలు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేయడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రజలను ఏదో ఉద్ధరిస్తామంటూ అధికారంలోకి వచ్చి ఘోరాతి ఘోరంగా 20 శాతం వరకు బస్సు చార్జీలు పెంచడం దుర్మార్గమైన విషయమని అన్నారు. ఒకవైపు విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు లేక, ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వేలాది మంది విద్యార్థులు రోడ్ల మీద పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సాయిబాబా అన్నారు. ప్రభుత్వ మంత్రులు ఢిల్లీకి హైదరాబాద్‌కు ప్రయాణాలు చేపట్టిన డబ్బును ప్రజల సంక్షేమం కొరకు ఖర్చు పెడితే ఈ విధంగా రేట్లు పెంచాల్సిన అవసరం రాదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు వాస్తవాలను గ్రహించి ఢిల్లీ వీధుల్లో తెలుగువారి ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ప్రజల సంక్షేమం పై దృష్టి పెట్టాలని అన్నారు. ఎంతో మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలూ రాక భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తుందని, కాబట్టి వెంటనే పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ప్రధాన కార్యదర్శులు నల్లెల్ల కిషోర్, బాలరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply