దేశ వ్యాపిత సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి

 

హైదరాబాద్, అద్దం న్యూస్  కేంద్రంలో బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా 29 చట్టాలను రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌లను తెచ్చి కార్మికుల హక్కులను, రాజ్యాంగ ప్రాథమిక హక్కులను లేకుండా చేస్తున్నందుకు దేశ వ్యాపితంగా జరుగు సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కేంద్ర కార్మిక, రాష్ట్ర కార్మిక సంఘాల, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్ల సదస్సు కార్మికవర్గానికి విజ్ఞప్తి చేసింది. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య‌ విజ్ఞాన‌కేంద్రంలో జరిగిన‌ రాష్ట్ర సదస్సుకు ఐఎన్‌టియుసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ విజయ్‌ కుమార్‌ యాదవ్‌, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు ఎండి.యూసుఫ్‌, సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, టియుసిఐ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎస్‌ఎల్‌.పద్మ, టిఎన్‌టియుసి, బిఆర్‌టియు, ఎఐయుటియుసి నాయకులు అధ్యక్షత వహించగా సదస్సులో ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌ రాష్ట్ర సదస్సు ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సంద‌ర్భంగా బాల్‌రాజ్ మాట్లాడుతూ.. కేంద్రంలో 3వ సారి అధికారానికి వచ్చిన బిజెపి ఎన్‌డిఎ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్‌ అనుకూల మతోన్మాద చర్యలను పెంచి పోషిస్తుందని ఆయన విమర్శించారు. కార్మికవర్గ సమరశీల పోరాటాల ద్వారా గత 102 సంవత్సరాల నుండి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలలో 29 కార్మిక చట్టాలను సమూలంగా రద్దు చేసి 4 లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చి అమలు చేసేందుకు ప్రయత్నిస్తుంటే కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఇప్పటికే 27 సార్లు దేశంలో సమ్మెలు చేస్తూ నిరసనలు, ధర్నాలు, ప్రదర్శనలు నిర్వహిస్తున్నందువల్ల కేంద్ర ప్రభుత్వం కోడ్‌లను అమలు చేయకుండా ఆపుతుందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాలు, స్వతంత్ర ఫెడరేషన్లు, అసోసియేషన్లు, 2025మే 20న దేశవ్యాపితంగా సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించాయని ఆయన తెలిపారు. ఈ సార్వత్రిక సమ్మెకు సంయుక్త కిసాన్‌మోర్చ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ కార్మికవర్గం మే 20న జరిగే సమ్మెకు సమాయత్తం కావాలని, సంఘటిత, అసంఘటిత కార్మికులు, ప్రభుత్వరంగ సంస్థల కార్మికులు ఉద్యోగులందరు ఈ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. మే 20న దేశవ్యాపిత సమ్మెలో రాష్ట్రంలోని అన్ని రంగాల సంఘటిత, అసంఘటిత కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. వచ్చే సమ్మెలోపు తక్షణమే ఈ క్రింది తీర్మానాలను అమలు చేయాలని నిర్ణయిచింది. అన్ని జిల్లా సదస్సులు ఏప్రిల్‌ 10 నుండి ఏప్రిల్‌ 20 మధ్య నిర్వహించాలని, ఈ సదస్సులకు వివిధ కార్మిక సంఘాల నుండి భారీగా సమీకరించాలని తీర్మానించటం జరిగింది. ఈ తీర్మానంపై కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఐఎన్‌టియుసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.డి.చంద్రశేఖర్‌, ఎఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు ఎం.డి.యూసుఫ్‌, హెచ్‌ఎంఎస్‌ నాయకులు అంజద్‌, సిఐటియు నాయకులు సాయిబాబ, టియుసిఐ నాయకులు కె.సూర్యం, టిఎన్‌టియుసి నాయకులు ఎం.కె.బోస్‌, బిఆర్‌టియు నాయకులు జి.రాంబాబు యాదవ్‌, ఎఐయుటియుసి నాయకులు క్రిష్ణ తదితరులు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 4 లేబర్‌ కోడ్‌లను అమల్లోకి తెచ్చి రోజుకు 12 గంటల పనిని చట్టబద్దం చేస్తున్నారని, సామాజిక భద్రతా పథకాలకు నిధులు తగ్గిస్తున్నారని, కార్మిక సంఘాల రిజిస్ట్రేషన్లను చేయకుండా కఠినతరం చేస్తున్నారని తెలిపారు. అన్ని రంగాల, అన్ని పరిశ్రమల కార్మికులకు మే 20 సమ్మెలో భాగస్వాములను చేయాలని, అన్ని యూనియన్లు మే 3వ తేదీలోపుగా సమ్మె నోటీసులు ఇవ్వాలని, ఏప్రిల్‌ 21 నుండి 30 మధ్య పారిశ్రామిక ప్రాంతాలలో నివాస ప్రాంతాలలో సదస్సులు జరపాలని, సమ్మె కరపత్రాలు లక్షల సంఖ్యలో ముద్రించి విస్తృతంగా ప్రచారం చేయాలని, సమ్మె పోస్టర్‌ ద్వారా విస్తృత ప్రచారం చేయాలని, బైక్‌ ర్యాలీలు, జిల్లాలు, రాష్ట్ర యూనియన్లు, ఫెడరేషన్లు, మండల స్థాయిలలో నిర్వహించాలని, మే 20న సమ్మె రోజు పరిశ్రమలు, పారిశ్రామిక ప్రాంతాలలో సమ్మె ఎఫెక్టివ్‌గా జరపాలని, సమ్మె రోజు ఇందిరాపార్కు వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించాలని, సమ్మె రోజు జిల్లా మండల కేంద్రాలలో, ప్రదర్శనలు సభలు విస్తృతంగా జరపాలని, సమ్మె రోజు మిలిటెంట్‌ యాక్టివ్‌గా ఉండాలని, సమ్మె ప్రచార కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియా ద్వారా కార్మికవర్గానికి చేరవేయాలని వక్తలు కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page