పిడిఎస్‌యు తలపెట్టిన రాష్ట్ర వ్యాపిత బంద్ విజయవంతం

పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబ‌ర్స్‌మెంట్స్‌, స్కాల‌ర్‌షిప్‌ల బకాయిల విడుదలకై

పిడిఎస్‌యు తలపెట్టిన రాష్ట్ర వ్యాపిత బంద్ విజయవంతం

హైదరాబాద్, మార్చి 26, అద్దం న్యూస్ :   పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబ‌ర్స్‌మెంట్స్‌, స్కాల‌ర్‌షిప్‌ల బకాయిల విడుదలకై పిడిఎస్‌యు తలపెట్టిన రాష్ట్ర వ్యాపిత బంద్ విజయవంతమైంది. ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్‌యు ) తలపెట్టిన రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్,పీజీ ప్రొఫెషనల్ కళాశాలల బంద్‌ను గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గం ఆధ్వర్యంలో శుక్ర‌వారం విద్యానగర్, ఓయూ, నారాయణగూడ, దిల్‌సుఖ్‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో బంద్‌ను నిర్వ‌హించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మహేష్, పొడపంగి నాగరాజు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మంద నవీన్, కె.శ్రీనివాస్ లు మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు ప్రభుత్వ నుండి రావలసిన బకాయిలు 10 వేల కోట్ల రూపాయ‌ల‌ ఫీజు రియింబ‌ర్స్‌మెంట్స్‌, స్కాల‌ర్‌షిప్‌ల‌ విడుదల చేయకుండా ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తూ ప్రత్యక్షంగా ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకముందు ఎన్నికల సమయంలో విద్యారంగానికి అనేక హామీలు ఇచ్చారు. ముఖ్యంగా మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రియింబ‌ర్స్‌మెంట్స్‌, స్కాల‌ర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేస్తాం, విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేటికీ 25 నెలలు పూర్తవుతున్న విద్యార్థులకు రావలసిన 10వేల కోట్ల బకాయిలు విడుదల చేయ‌లేద‌ని విమ‌ర్శించారు.

ఫ‌లితంగా లక్షలాది మంది విద్యార్థులు డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల విద్యా సంవత్సరం పూర్తయిన రియింబ‌ర్స్‌మెంట్స్‌ రాకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజు మొత్తం చెల్లిస్తే తప్ప మీ యొక్క సర్టిఫికెట్స్ ఇవ్వమని చెబుతున్నార‌ని తెలిపారు. విద్యార్థులు విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో 2025 జూలై మొదటి వారంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడి చేసిన కనీసం పేద విద్యార్థులపై దయ లేకుండా బకాయిలు విడుదల చేయకుండా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన పేద వర్గాలు ఎస్సీ, ఎస్టి కులాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన మెరుగైన విద్యను అందించడం కోసం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ స్కూల్‌లో సుమారు 27,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తుంటే వారికి చెల్లించవలసిన బకాయిలు నేటికీ 218 కోట్ల రూపాయలు విడుదల చేయలేద‌న్నారు.

పాఠశాల యాజమాన్యాలు తల్లిదండ్రులకు మీ పిల్లలకు మేము చదువు చేప్పలేయము అంటూ లేఖలు రాస్తుంటే ప్రభుత్వానికి సొయిలేదు అన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల పట్ల ప్రభుత్వ నియంతృత్వ వైఖరి విడనాడి వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సవరించి విద్యా రంగానికి అధిక శాతం నిధులు కేటాయించాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రియింబ‌ర్స్‌మెంట్స్‌, స్కాల‌ర్‌షిప్‌ల‌ను, బెస్ట్ అవైలబుల్ స్కీమ్స్ పాఠశాలల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు తీగల శ్యామ్, సహాయ కార్యదర్శిలు కె.ఝాన్సీ, జి.యశ్వంత్, జిల్లా నాయకులు గణేష్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page