తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ప్రతి తెలుగు వాడి గుండెలో చిరస్థాయిగా ఉంది
– టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్
హైదరాబాద్, మార్చి 29, అద్దం న్యూస్ : తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉందని దివంగత ఎన్‌టిఆర్ కారణ జన్ముడని, ఆయన స్థాపించిన పార్టీ రోజు వరకు కూడా ప్రతి తెలుగు వాడి గుండెల్లో చిరస్థాయిగా నిలచి ఉందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ దోమలగూడలోని టిడిపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ హాజరై ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేక్ కటింగ్ చేసిన అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు అరవింద్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా వస్త్రాల పంపిణీ చేసారు. ఈ సందర్బంగా అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజలకు, తెలుగువారి అభివృద్ది కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాలలో శాశ్వతంగా నెలకొని ఉన్న దివంగత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని ( 29వ తేదీ 1982 ) స్థాపించి 44 వసంతాలు పూర్తవుతుందన్నారు. ఆ మహనీయుని వల్లనే పేద బడుగు బలహీన వర్గాల ప్రజల్లో రాజకీయ చైతన్యం వచ్చిందని, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఎల్లప్పుడు ప్రజల కోసమే, ప్రజలతో మమేకమై ఉంటుందని అన్నారు.
ఎన్‌టిఆర్ ఆశయాలకు, ఆదర్శాలకనుగుణంగా కోసం అందరూ కృషి చేయాలని అన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌టిఆర్‌కు భారత రత్న పురస్కారం అందజేయాలని డిమాండ్ చేసారు. తెలంగాణలో పటేల్.. పట్వారి వ్యవస్థను రూపుమాపి సామాన్యునికి రాజకీయ భవిష్యత్తును కల్పించిన ఘనత ఎన్‌టి రామారావుదే అని అన్నారు. ఆనాడు ఎన్‌టిఆర్ చేపట్టిన రూ.2లకే కిలో బియ్యం, జనతా వస్త్రాలు, సగం ధరకే కరెంటు, ఆడబిడ్డకు ఆస్తిలో సగభాగం, దున్నే వాడిదే భూమి ఇలాంటి ఏన్నో సంక్షేమ పథకాలు ఆయన ఆరంభించినవే అని గుర్తు చేశారు. ఈ రోజు దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో చేపతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయనే ఆద్యుడన్నారు. ఎన్‌టిఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాజకీయ పార్టీలకు ఆదర్శంగా నిలిచాయని, అందుకే ఎన్‌టిఆర్ ఈ నాటికి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నగర నాయకులు శ్యామ్ సుందర్, పరుశురామ్, కిరణ్, భానుప్రకాష్, ఎస్.ప్రకాష్, చంద్రమోహన్ గౌడ్, నాయుడు, ఓ.వెంకటేష్ చౌదరి, వైఎల్. నర్సింహా గౌడ్, ఆనంద్, సత్యనారాయణ, శక్తి ప్రేమ్, సాయి, యాదగిరి, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.















Leave a Reply