ప‌ని చేసిన ఇంట్లోనే చోరీ – రూ.1.70 కోట్ల విలువ చేసే సొత్తు, నగదు చోరీ – పది రోజుల్లో దొంగలను పట్టుకున్న పోలీసులు – న‌లుగురి నిందితుల అరెస్ట్, ప‌రారీలో ముగ్గురు

   ప‌ని చేసిన ఇంట్లోనే చోరీ

  రూ.1.70 కోట్ల విలువ చేసే సొత్తు, నగదు చోరీ

  పది రోజుల్లో దొంగలను పట్టుకున్న పోలీసులు

  న‌లుగురి నిందితుల అరెస్ట్, ప‌రారీలో ముగ్గురు

హైదరాబాద్, జూన్ 17, అద్దం న్యూస్ :   ప‌ని చేసిన ఇంటికే క‌న్నం పెట్టి రూ.1.70 కోట్ల విలువ చేసే సొత్తు, న‌గ‌దు చోరి కేసును కేవ‌లం ప‌ది రోజుల్లోనే నారాయ‌ణ‌గూడ పోలీసులు ఛేదించారు. మంగ‌ళ‌వారం చోరీకి సంబంధించిన కేసు వివ‌రాల‌ను ఈస్ట్ జోన్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బాలస్వామి, ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ ఏ.శ్రీనివాస్‌, టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య ల‌తో కలిసి ఈ చోరీ వివరాలను వెల్లడించారు. ఆసిఫ్‌న‌గ‌ర్ కార్వాన్ అమ్లాపూర్‌కు చెందిన చౌపాల్ సాగ‌ర్ కుమార్ ( 22 ) వృత్తిరీత్యా పాన్ షాప్ వ్యాపారం చేస్తుంటాడు. బ‌షీర్‌బాగ్ అవంతిన‌గ‌ర్ కాల‌నీలో నూక‌ల రామ‌కృష్ణ ( 42 ) అనే వ్యాపారి ఇంట్లో చౌపాల్ సాగ‌ర్ కుమార్ భార్య షాలిని ప‌ని మ‌నిషిగా చేరింది. కొద్ది రోజుల త‌ర్వాత ప‌ని మానేసిన షాలిని ఆమె స్థానంలో త‌న త‌ల్లి నీలిమ‌ను రామ‌కృష్ణ ఇంట్లో ప‌నికి కుదుర్చింది. ఇదిలా ఉండ‌గా చౌపాల్ సాగ‌ర్ కుమార్ డ‌బ్బు సంపాదించి రిచ్‌గా లైఫ్ సెట్ చేయాల‌నే ఆలోచ‌న‌తో ఉండేవాడు. ఈ క్ర‌మంలోనే అవంతిన‌గ‌ర్‌లోని నూక‌ల రామృష్ణ నివాసంలో చోరీ చేస్తే భారీ న‌గలు, న‌గ‌దు వ‌స్తాయ‌ని పక్కా ప్లాన్ వేశాడు. రామ‌కృష్ణ నివాసంలో చోరీ చేయాల‌ని ప్లాన్ వేశాడు. ఈ విష‌యాన్ని చౌపాల్ సాగ‌ర్ త‌న భార్య షాలిని, తండ్రి చౌపాల్ చంద్ర‌శేఖ‌ర్‌, మరదలు ఆశ్విని ల‌తో చ‌ర్చించాడు. ఈ క్ర‌మంలోనే రామ‌కృష్ణ త‌న కుటుంబంతో క‌లిసి ఈ నెల 5వ తేదీన టూర్‌కు వెళ్లాడు. ఇదే అదును అనుకున్న చౌపాల్ సాగ‌ర్ కుమార్ త‌న ప్లాన్ అమ‌లుకు రంగంలోకి దిగాడు. ఈ నెల 5వ ఆర్ధరాత్రి కిటికీ గ్రీల్స్ తొలగించి రామకృష్ణ ఇంట్లోకి ప్రవేశించారు. లాకర్‌లో ఉన్న 173 తులాల బంగారు ఆభరణాలు, రూ.17.50 లక్షల నగదు, 8 ఖరీదైన వాచ్‌ల‌ను ఎత్తుకెళ్లారు. టూర్ ముగించుకుని ఈ నెల 7న టూర్ నుంచి తిరిగి ఇంటికి వచ్చిన రామకృష్ణ చోరీ జరిగినట్లు గమనించాడు. ఈ నెల 7వ తేదీన రామ‌కృష్ణ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ముమ్మరంగా దర్యాప్తు చేశారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీ, ఇతర ఆధారాలతో చోరీకి పాల్పడిన వారిలో చౌపాల్ సాగ‌ర్ కుమార్‌, ఆకాష్ కుమార్ మండ‌ల్ ( 19 ), సక్లైన్ ఖాన్ ( 19 ), చంద్ర‌శేఖ‌ర్ చౌపాల్ ( 49 )ల‌ను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 158 తులాల బంగారు అభరణాలు, రూ.10.75 లక్షల నగదు, 8 వాచ్లను స్వాధీనం చేసుకున్నారు. మిగతా నిందితులను రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. ఏ-1 చౌపాల్ సాగర్ కుమార్ భార్య శాలిని, మరదలు అశ్విని, మరో నిందితుడు ఆశ్విన్ పరారీలో ఉన్నట్లు డీసీపీ వెల్లడించారు. ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ అడిష‌న‌ల్ డిసిపి మట్టయ్య, సుల్తాన్‌బ‌జార్ ఏసిపి దివ్న్‌, నారాయణగూడ ఇన్‌స్పెక్ట‌ర్ చంద్రశేఖర్, డీఐ డి.నాగార్జున, డీఎస్ఐ డి.వెంకటేశ్ లతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page