...

తేజస్వి సూర్య వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి స‌మ‌ర్ధించ‌డం నీతిమాలిన చ‌ర్య‌

బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి స‌మ‌ర్ధించ‌డం నీతిమాలిన చ‌ర్య‌
» టిడిపి సికింద్రాబాద్ పార్లమెంటు నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాల్‌రాజ్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 17, అద్దం న్యూస్ :    బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పార్లమెంటు సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనను భారతదేశం–పాకిస్థాన్ విభజనతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం నాయకులు నల్లెల్ల‌ కిషోర్, ప‌లుస బాల్‌రాజ్ గౌడ్ లు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను బిజెపి మంత్రి జి.కిషన్ రెడ్డి సమర్థించడం పూర్తిగా నీతి మాలిన చర్య అని అన్నారు. హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి జిల్లా కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో వారు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కొన్ని దశాబ్దాల పోరాటం, 1200 మంది బలిదానాలు, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల ఫలితం అని అన్నారు. అటువంటి పవిత్రమైన ఉద్యమ ఫలితాన్ని, రక్తపాతంతో కూడిన భారత్-పాక్ విభజనతో పోల్చడం తేజస్వి సూర్య అజ్ఞానానికి పరాకాష్ట. ఇది తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవమానించడమే అని వారు మండిపడ్డారు. ఇండియా పాక్ లను విభజనతో పోల్చిందంటే బిజెపి నాటి బ్రిటిష్ పాలకుల్లాగా వ్యవహరిస్తున్నారని అన్నారు. తేజస్వి సూర్య సభలో విషం చిమ్ముతుంటే తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటం సిగ్గుచేటు అని ధ్వ‌జ‌మెత్తారు.

తెలంగాణ ఏర్పాటును ఒక దురదృష్టకర సంఘటనగా చిత్రీకరించడం ద్వారా బీజేపీ తన ద్వంద్వ నీతిని బయటపెట్టుకుందని అన్నారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన హక్కుల గురించి మాట్లాడకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసం ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చేలా మాట్లాడటం దుర్మార్గం అని, దక్షిణాది రాష్ట్రాల పట్ల, ముఖ్యంగా తెలంగాణ పట్ల బీజేపీ నేతలకు ఉన్న చిన్నచూపు ఈ వ్యాఖ్యల ద్వారా మరోసారి స్పష్టమైందన్నారు. తేజస్వి సూర్య వెంటనే తెలంగాణ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. గతంలో వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్ వంటి బీజేపీ అగ్రనేతలు రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేశారు.

నేటి బీజేపీ నాయకత్వం మాత్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలను సహించే ప్రసక్తే లేదని నల్లెల్ల కిషోర్ హెచ్చరించారు.బీజేపీ నాయకులు తమ నోటిని అదుపులో ఉంచుకోవాలని, అభివృద్ధి, రాష్ట్ర హక్కుల సాధనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. లేనిపక్షంలో తెలంగాణ ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు శ్రీపతి సతీష్, ఎం.శ్యామ్ సుందర్, కరణం కిరణ్, భాను ప్రకాష్, ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.