Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADప్రణాళిక రహిత నిర్మాణాలే వరద ముంపున‌కు కారణం

ప్రణాళిక రహిత నిర్మాణాలే వరద ముంపున‌కు కారణం

📰 Generate e-Paper Clip

ప్రణాళిక రహిత నిర్మాణాలే వరద ముంపున‌కు కారణం
ప్రజా సంఘాలు, పర్యావరణ కార్యకర్తలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాలి
– చర్చా గోష్టిలో డాక్ట‌ర్‌.దొంతి నరసింహారెడ్డి

హైద‌రాబాద్‌, జూన్ 28, ( అద్దం న్యూస్ ) :   ప్రణాళిక రహిత నిర్మాణాలే వరద ముంపున‌కు కారణం అని ప‌లువురు పర్యావరణవేత్తలు అన్నారు. హైదరాబాద్‌లో వరద నీటి కష్టాలు – ప్రభుత్వ సన్నద్ధత అనే అంశంపై హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం ( HCF ), అర్బన్ డెవలప్‌మెంట్‌ ఫోరం ( UDF ) ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చా గోష్టి జ‌రిగింది. ఈ చ‌ర్చాగోష్టికి అర్బన్ పాలసీ నిపుణులు డాక్ట‌ర్‌.దొంతి నరసింహారెడ్డి, పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్, యుడిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఎం.శ్రీనివాస్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్‌.దొంతి నరసింహారెడ్డి మాట్లాడుతూ… మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా ప్రణాళిక రహితంగా నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం కారణంగానే, వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి వరద ముంపుకు దారితీస్తున్నాయన్నారు. ప్రజా సంఘాలు, పర్యావరణ కార్యకర్తలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయాల‌న్నారు. మెట్రో రైల్ పిల్లర్ల మధ్య నిర్మాణాలు కూడా, వరదకు కారణం అవుతున్నాయని పేర్కొన్నారు. రోడ్లు, ఫ్లైఓవర్లు కాల్వల్లాగా మారిపోవడానికి కారణం సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడమే అని అన్నారు. వర్షాకాల సమస్యలపై అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి, నగరంలో ప్రజా సమస్యలపై పని చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీవోలు, పర్యావరణవేత్తలు, సంక్షేమ సంఘాలతో ఎందుకు చర్చించలేదు ? వీరితో తక్షణమే సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.

ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ లుబ్నా సర్వత్ మాట్లాడుతూ… బంజారాహిల్స్ లోని వరద నీరు పల్లానికి ప్రవహించి ఏనుగుల కుంటలో చేరేవని, ప్రస్తుతం అక్కడ పార్కు నిర్మించడం వలన ఆ నీళ్ళు రోడ్లు, ఇళ్ళు, అపార్ట్‌మెంట్ల‌ల్లోకి వస్తున్నాయని విమర్శించారు. హైడ్రా చెరువుల సుందరీకరణకు ఇస్తున్న ప్రాధాన్యత చెరువుల విస్తీర్ణం, లోతులకు ఇవ్వటంలేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జా భూమిలో ఆవులను మేపుతున్నానని, కబ్జాను కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. అర్బన్ డెవ‌ల‌ప్‌మెంట్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్ ఎం.శ్రీనివాస్ మాట్లాడుతూ… జూన్ 9 వర్షానికి అనేక చెట్లు కూలాయని, విద్యుత్ తీగలు తెగిపడ్డాయని, స్టీల్ బ్రిడ్జి పైన కూడా నీళ్లు నిలిచాయని ఇది హైదరాబాద్‌ వాస్తవ పరిస్థితిని బట్టబయలు చేసిందని అన్నారు. నిమ్స్ వద్ద రోడ్డు పైనున్న చిన్న గుడి రాకపోకలకు తీవ్ర ఆటంకంగా ఉన్నదని, రోడ్డు ప్రక్కన ఉన్న గుడులు, మసీదులు, చర్చిలను పక్కనే ఉన్న స్థలాలకు మార్చి ట్రాఫిక్ ఇబ్బందులను నివారించేందుకు హైడ్రా కృషి చేయాలని సూచించారు. ఈ చర్చా గోష్టికి హెచ్‌సిఎఫ్ ప్రధాన కార్యదర్శి కె.వీరయ్య అధ్యక్షత వహించగా, ఉపాధ్యక్షుడు మల్లం రమేష్ వేదికపై ఆహ్వానించిన ఈ స‌మావేశానికి ఎం.శ్రీనివాసరావు, హెచ్‌సిఎఫ్ నగర నాయకులు పి.శ్రీనివాసరావు, రాజమౌళి, డి.సైదులు, సంగీత, శ్వేత, కే.రమేష్, సుకుమార్, గోపాల్, నాగేష్, శంకరయ్య, రింగ్ సైజులు, మోహన్, ఆర్ఇ.బాబు, నరసింగరావులు నాయకత్వం వహించారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page