తెలంగాణలో రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం ( RRR ) నడుస్తోంది
– తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ బ్యూరో, ఆగస్టు 18, ( అద్దం న్యూస్ ) : తెలంగాణలో రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం (RRR) నడుస్తోందని తెలంగాణ రక్షణ సేన ( టీఆర్ఎస్ ) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మంగళవారం మీడియాతో కవిత మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి ఏడుగురు అన్నదమ్ములు కలిసి ఏడు దిక్కులా పేద ప్రజల భూములను గుంజుకుని పెద్దవాళ్లకు అప్పగిస్తున్నారు, తెలంగాణలో రాక్షస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమకారురాలు విజయశాంతి ని ఎమ్మెల్సీ చేసి సైలెంట్ చేశారని.. ఆమెకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు ? అని ప్రశ్నించారు. అందుకే ఈ ముఖ్యమంత్రి సామాజిక న్యాయం అంటే మనం నమ్మవద్దని.. మేక వన్నె పులి మాదిరిగా ఆయన సామాజిక న్యాయం అంటున్నాడన్నారు. ఇటీవల అడ్వయిజరీ పదవులు వీహెచ్ కు, డీజీపీ శివధర్ రెడ్డి కు ఇచ్చారని…కానీ వీహెచ్ కు చాలా తక్కువ జీతం, తక్కువ ర్యాంక్ ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌లో ఎప్పటి నుంచో ఉండి మేము చిన్ననాటి నుంచి కూడా రాజీవ్ గాంధీ జయంతి నిర్వహిస్తున్న వ్యక్తి వీహెచ్ అని, ఆయనకు తక్కువ జీతం, తక్కువ ర్యాంక్ ఇచ్చారని.. శశిధర్ రెడ్డికి మాత్రం రెండున్నర లక్షల జీతం ఇచ్చారని తెలిపారు. ఎందుకు వారిద్దరిలో అంత వత్యాసం ? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీఐ కమిషనర్లు ఇస్తే వారిలో ఒక్క బీసీ కూడా లేడని.. పైగా ఆర్టీఐ కమిషనర్ భార్యను చిత్రపురి కాలనీ సోసైటీలో మెంబర్ ను చేశారన్నారు. చిత్రపురి కాలనీ వాళ్లకు న్యాయం చేస్తానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి ఊదరగొట్టారని విమర్శించారు. 52 జడ్జిమెంట్లు ఉన్నా సరే వారికి న్యాయం చేయటం లేదని.. సంబంధం లేని వాళ్లకు సోసైటీలో పదవులు ఇచ్చారన్నారు. ఎటు పక్క చూసిన సరే అగ్రకులాలకు చెందిన వారికే పదవులు ఇస్తున్నారన్నారు. ఈ ముఖ్యమంత్రి మాట్లాడేది సామాజిక న్యాయం, కానీ చేసేది అటవీక న్యాయం అని ఎద్దేవా చేశారు. ప్రియాంక గాంధీ పోటీ చేస్తే మీరంతా వెళ్లి గెలిపించుకుంటారు కానీ… మీనాక్షి నటరాజన్ ను మాత్రం ఈ ముఖ్యమంత్రే కుట్ర చేసి ఓడిస్తాడని ఆరోపించారు.
యాదగిరి గుట్టలో డిప్యూటీ సీఎం ను కింద కూర్చోబెట్టి అవమానించారని, ఎంపీ వంశీ కి కనీసం పుష్కరాల ఇన్విటేషన్ కూడా ఇవ్వలేదన్నారు. బీసీ బిడ్డలు మంత్రి వాకిటి, కొండా సురేఖలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘోరంగా అవమానించారని, పొంగులేటి కన్నా సీనియర్ అయిన కొండా సురేఖను అవమానించలేదా ? అని కవిత గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకునే క్రమశిక్షణ చర్యల్లో కూడా బీసీలకు ఒక విధంగా, అగ్రకులాలకు ఒక విధంగా ఉంటాయన్నారు. ఇక తెలంగాణలో జరుగుతున్న భూదోపిడీ గురించి దేశం మొత్తం కథలు కథలుగా చెప్పుకుంటోందన్నారు. ముఖ్యమంత్రి సోదరులు ఏడుగురు తెలంగాణ భూమాతా చెరబట్టారన్నారు. వాళ్ల రౌడీ ముఠా మొత్తం తెలంగాణ భూమిని దొంగతనం చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వం వద్ద 60 లక్షల ఎకరాలు ఉందని, భూదాన్ భూములు కూడా ఉన్నాయన్నారు. భూదాన్ భూముల్లో దాదాపు లక్ష ఎకరాలు ఎక్కడకు పోయాయో లెక్క లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో కుటుంబానికి ఎకరం భూమి పంచేందుకు ఉంది.. కానీ ప్రభుత్వాలకు మనసు లేదని ధ్వజమెత్తారు. ధరణి, భూ భారతి అనేది రెండింటిని మిస్ యూజ్ చేస్తున్నారని అన్నారు. 22 ఏ అనేది ఈ ప్రభుత్వం భూ దొంగతనం చేసేందుకు వేసుకుంటున్న రాచబాట అని విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు భూ దొంగలు అని అన్నారు. వికారాబాద్ లో పరిశ్రమల పేరుతో 80 శాతం అసైన్డ్ ల్యాండ్ లను తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత భూ లక్ష్మి పేరుతో ప్రతి కుటుంబానికి ఎకరం భూమి పంచుతామని కవిత స్పష్టం చేశారు.












Leave a Reply