...

గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తాం – సీఎం రేవంత్‌రెడ్డి

గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తాం
– సీఎం రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌, ఆగ‌స్టు 18, ( అద్దం న్యూస్ ) :  రాష్ట్రంలో గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైద‌రాబాద్ ట్యాంక్‌బండ్‌ పైన మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం వారి చిత్రానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షులు బి.మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ… గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ సంతృప్త స్థాయిలో పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చాను అని గుర్తుచేశారు. గౌడ సోదరులకు 50 వేల కాటమయ్య కిట్లను పంపిణీ చేశాం. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే 5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తున్నామ‌ని చెప్పారు. గీత కార్మికుల వృత్తిని కాపాడటానికి నీటి పారుదల ప్రాజెక్టుల కాలువల గట్లపైన ఈత, తాటి చెట్లను నాటాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.

దొరలు, భూస్వాములు, పెత్తందార్లపై పోరాటం సాగించిన యోధుడు, ముదిరాజ్‌ల ఆరాధ్య దైవం పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసున‌ని..అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. గీత కార్మికులు, గౌడన్నలు ఎంతో కాలంగా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్న నేపథ్యంలో నేనే స్వయంగా నెక్లెస్ రోడ్ చౌరస్తాకు వెళ్లి స్థలాన్ని పరిశీలించి జ్యోతిరావు పూలే దంపతులకు విగ్రహం ఉండాలని స్థలాన్ని ఎంపిక చేశానన్నారు. అలాగే, సర్వాయి పాపన్న పోరాట స్ఫూర్తి ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో ట్యాంక్ బండ్ పర్యాటక శాఖ కార్యాలయాన్ని మరో చోటికి తరలించి ఆ స్థలంలో పాపన్న విగ్రహం ఏర్పాటు చేసుకున్నామ‌ని తెలిపారు. హైదరాబాద్ సందర్శనకు వచ్చే పర్యాటకులు, గణేష్ నిమజ్జన సమయంలో ట్యాంక్ బండ్ నుంచి ఎవరు వెళ్లినా ఒక స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశామ‌ని వివరించారు. బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారని, ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలన్నారు. సర్వాయి పాపన్న ఒక కులానికి, కుటుంబానికి కాదు…బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నఅని అన్నారు.

ఇది బహుజనుల తెలంగాణ. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించామ‌న్నారు. మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో, తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యత ఇస్తారని, బహుజనుల కోసం తన జీవితాన్ని అంకితం చేశారు కాబట్టే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కిందని గుర్తు చేశారు. కుల వృత్తిని కొనసాగించండి.. గౌరవించండి… పిల్లలను మాత్రం చదివించండన్నారు. పిల్లలను చదివించి వారు ఉన్నతస్థానానికి చేరుకుని తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థుల కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామ‌ని.. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా ఇస్తామ‌ని తెలిపారు. గతంలో సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం పెట్టలేదని, మా ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామ‌ని, నాణ్యమైన అల్పాహారం, పాలు, రాగిజావ పిల్లలకు ఇస్తున్నామ‌ని తెలిపారు. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలని, వాళ్లను చదివించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఏటీసీల్లో చేరేవాళ్లకు నెలకు 2 వేల రూపాయల ఉపకార వేతనం ఇస్తున్నామ‌న్నారు. సామాజిక న్యాయం కోసం రాష్ట్రంలో బీసీ కులగణన చేశామ‌ని.. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేశామ‌ని… నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నామ‌ని సీఎం చెప్పారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.