హైదరాబాద్, నవంబర్ 19, అద్దం న్యూస్ : కాంగ్రెస్, బిజెపి లు బిసిలకు ఒకరు మొదటి ముద్దాయి, మరొకరు రెండవ ముద్దాయి అని బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీల రిజర్వేషన్ల పెంపుకై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగాన్ని సవరించాలని. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను ఇచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హైదరాబాద్ ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద బిసి జేఏసి నిరసన కార్యక్రమం జరిగింది. బీసీ జేఏసీ చీఫ్ కో–ఆర్డినేటర్ గుజ్జ కృష్ణ, కో–ఆర్డినేటర్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి మద్దతుగా ఎమ్మెల్సి మధుసూదనా చారి, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచడానికి ఈ నిరసనను నిర్వహించామన్నారు. తెలంగాణలో బిసిలు చేసేది ధర్మపోరాటమని, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రకటించారని, 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని ఊదరగొట్టారన్నారు. గ్రామ పంచాయతి ఎన్నికలకు వెళ్తామని, 3 వేల కోట్లు నిధులు ఆగిపోతున్నాయని, ఈ ఒంకతో, డొంక తిరుగుడు మాటలతో సర్పంచ్ ఎన్నికలను ఈ నెల 17వ తేదీన జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ప్రకటించి ఆ నెపం అంతా బిసిలపై మోపే ప్రయత్నం చేస్తుందని ధ్వజమెత్తారు. బీసీల రిజర్వేషన్ల పెంపుకై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగాన్ని సవరించాలని, బీసీ రిజర్వేషన్లు పెంచకుండా బిసిలకు అన్యాయం చేస్తున్న ఢిల్లీలో ఉన్న బిజెపి, గల్లీలో ఉన్న కాంగ్రెస్ లు ద్రోహుల పార్టీలనే అని అన్నారు. రిజర్వేషన్లు ఎవరికి ఇచ్చే బిక్ష కాదని.. మా సామాజిక హక్కు అని అన్నారు. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం అంటే తెలంగాణ రెడ్ల రాజ్యం తేవడం కోసమే అని ధ్వజమెత్తారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే మాకు అభ్యంతరంలేదని, కానీ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇచ్చే బిచ్చం, ఎంగిలి మెతుకులు మాకు అవసరంలేదన్నారు. బిసిలకు చట్టబద్ధంగా, రాజ్యాంబద్దంగా హక్కుల కావాలని, ఆ హక్కు కోసమే రెండు సంవత్సరాలుగా బిసిలు పోరాటం చేస్తున్నామని, ఆ హక్కు కోసమే బిసి బంద్‌ను, బిసి జేఏసి ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్షలను నిర్వహించామని తెలిపారు. కాంగ్రెస్, బిజెపి పార్టీలు బిసిలను రాజకీయంగా అణిచివేసేందుకు పోటీ పడుతున్నాయని విమర్శించారు.
డిసెంబర్ మొదటి వారంలో బిసి జేఏసి ఆధ్వర్యంలో పార్లమెంట్ దిగ్బంధనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని, దానికి భయపడి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు లు బిసి రిజర్వేషన్ల పై పార్లమెంట్ సభ్యులు మాట్లాడుతారని తప్పుదోవపట్టిస్తున్నారన్నారు. రేవంత్‌రెడ్డి సీఎం కావాలి… పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రి కావాలి.. కేంద్ర మంత్రులు అవుతారు కానీ బిసిలు మాత్రం సర్పంచ్‌లు కావొద్దా అని ప్రశ్నించారు. అగ్రకుల పాలనను తెలంగాణ గడ్డ పై బొందపెడుతామని హెచ్చరించారు. బిసి జేఏసి విస్త్రృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ మొదటి వారంలో జరుగనున్న పార్లమెంట్‌ను స్థంభించాలని, సీఎం రేవంత్‌రెడ్డి వారం పది రోజులైనా ఢిల్లీలోనే ఉండి బిసి సమాజం తరపున కొట్లాడాలన్నారు. అగ్రకులాలకు ఈడబ్లుసి రిజర్వేషన్లను మాత్రం రాత్రికి రాత్రే ఇస్తారని, బిసిలకు రిజర్వేషన్లను మాత్రం ఇవ్వరన్నారు. 42 శాతం బిసి రిజర్వేషన్లను ఇవ్వకపోతే తెలంగాణ ఉద్యమ తరహాలో, రైతు ఉద్యమాల మాదిరిగా గల్లి నుంచి ఢిల్లీ వరకు పోరాటాలను చేస్తామన్నారు. ఎమ్మెల్సి మధుసూదనా చారి మాట్లాడుతూ…. కసాయి వాడినే గొర్రె నమ్మినట్టు ఎవరికైతే రాజ్యాధికారం కట్టబెట్టామో వారికే దండాలు పెట్టి న్యాయం చేయడంలేదని ఈ రోజు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియచేస్తున్నామన్నారు. బిసి రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బిజేపి పార్టీలు లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నాయన్నారు. బిసిలకు అన్ని రకాలుగా ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పార్టీల తరపున బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడమంటే బిసిలను రాజకీయంగా దూరం చేసేందుకు చేసే కుట్రే అని అన్నారు. రాజకీయాలకతీతంగా తెలంగాణ సమాజంలో ఉన్న బిసీలందరూ ఐక్యంగా వచ్చి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మెన్ కుందారం గణేష్ చారి, రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ, బీసీ నేతలు నరసింహ నాయక్, నందగోపాల్, జాజుల లింగం గౌడ్, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, గొడుగు మల్లికార్జున్ ముదిరాజ్, వెంకటేష్ గౌడ్, ఉదయనేత, మల్లికార్జున యాదవ్, పానుగంటి విజయ్, నరసింహ చారి, లచ్చ గౌడ్, కవుల జగన్నాథం, కవిత, శివమ్మ, తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply