Tuesday, November 3, 2026
No menu items!
HomeFoodశుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలి – జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలి – జలమండలి ఎండీ అశోక్ రెడ్డి

📰 Generate e-Paper Clip

దుర్గం చెరువు ఎస్‌టిపి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన ఎండీ
# గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యను పెంచాలి
# నిర్మాణ పనులు, గార్డెనింగ్‌కు శుద్ధి చేసిన నీటినే వినియోగించాలి
# ప్రతి ఎస్‌టిపి వద్ద నీటి నాణ్యత వివరాలతో ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలి
# మైండ్‌స్పేస్, రహేజా సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం
# ట్యాంకర్ల బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రత్యేక మొబైల్ యాప్ వినియోగం తప్పనిసరి

హైద‌రాబాద్ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :   మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో ( ఎస్‌టిపిలు ) శుద్ధి చేసిన నీటిని తాగునీటి యేతర అవసరాలకు విస్తృతంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం దుర్గం చెరువు ఎస్‌టిపిని సందర్శించిన ఆయన శుద్ధి ప్రక్రియ, నీటి నాణ్యతతో పాటు గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ కార్యకలాపాలను పరిశీలించారు. ట్యాంకర్ల ఫిల్లింగ్, సరఫరా, నిర్వహణ తీరును సమీక్షించారు. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యను పెంచి, శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తృతం చేయాలని సూచించారు.

నిర్మాణ పనులకు గ్రీన్ వాటర్ వినియోగించాలి :
 జలమండలి అధికారులు, మైండ్‌స్పేస్, రహేజా గ్రూప్ ప్రతినిధులతో ఎండీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఆయా సంస్థల నిర్మాణ పనులు, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్ తదితర తాగేతర అవసరాలకు మంచినీటికి బదులుగా ఎస్‌టిపిల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని సూచించారు. ఇందుకు అవసరమైన గ్రీన్ వాటర్ సరఫరా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 51లోని జలమండలి జలసంరక్షణ థీమ్ పార్కు గార్డెనింగ్ అవసరాలకు శుద్ధి చేసిన నీటిని వినియోగించేలా చర్యలు చేపట్టాలన్నారు.

ప్రతి ఎస్‌టిపి వద్ద నీటి నాణ్యత డిస్‌ప్లే బోర్డులు :
జలమండలి ఎస్‌టిపిల్లో శుద్ధి చేసిన నీటి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని ఎండీ ఆదేశించారు. జాతీయ హరిత ట్రైబ్యునల్ ( NGT ) నిర్దేశించిన వర్తించే ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి జరుగుతోందా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఎస్‌టిపి వద్ద ఎల్ఈడీ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేసి, బీఓడీ ( BOD ), సీఓడీ ( COD ), టీఎస్ఎస్ ( TSS ), పీహెచ్ ( pH ) వంటి కీలక పారామీటర్ల వాస్తవ విలువలతో పాటు నిర్దేశిత ప్రమాణాలను ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని సూచించారు. తద్వారా వినియోగదారుల్లో నీటి నాణ్యతపై నమ్మకాన్ని పెంపొందించవచ్చన్నారు.

గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ట్రిప్పులు పెంచాలి :
జలమండలి 37వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన గ్రీన్ వాటర్ ట్యాంకర్ల కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా అమలు చేయాలని ఎండీ సూచించారు. మూడు రీజియన్ల పరిధిలోని ఎస్‌టిపిల నుంచి శుద్ధి చేసిన నీటిని నిర్మాణ సంస్థలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమలు, ఇతర బల్క్ వాటర్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ట్రిప్పుల సంఖ్యను పెంచడంతో పాటు, ఈ కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. తాగునీటిని తాగునీటి అవసరాలకే వినియోగించి, ఇతర అవసరాలకు శుద్ధి చేసిన నీటిని ఉపయోగించడం ద్వారా మంచినీటి వనరులను సంరక్షించుకోవచ్చని పేర్కొన్నారు. గ్రీన్ వాటర్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ముందుకు రావాలని కోరారు.

ట్యాంకర్ల నిర్వహణకు ప్రత్యేక మొబైల్ యాప్ :
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల బుకింగ్, కేటాయింపు, ఫిల్లింగ్, డెలివరీ ప్రక్రియలను ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఎండీ తెలిపారు. సంబంధిత డైరెక్టర్లు, మేనేజర్లు, ఆపరేటర్లు, ఫిల్లింగ్ స్టేషన్ ఇన్‌చార్జులు, ట్యాంకర్ డ్రైవర్లు తప్పనిసరిగా యాప్‌ను వినియోగించాలని ఆదేశించారు. బుకింగ్ నుంచి డెలివరీ వరకు ప్రతి దశ వివరాలను ఎప్పటికప్పుడు యాప్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. ట్యాంకర్ల సరఫరాలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి సైబరాబాద్ రీజియన్ ఈడి సంతోష్, సీజియం పద్మజతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page