పేట్ బషీరాబాద్, నిజాంపేట్ స్థలాలే ఇవ్వాలని డిమాండ్
– జర్నలిస్టుల ఇళ్ళస్థలాల పై జాప్యం తగదు
– ప్రత్యేక జీవో ద్వారా స్థలాలు కేటాయించాలి
– టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 3, ( అద్దం న్యూస్ ) : ఇళ్ళస్థలాల కోసం పద్దెనిమిదేళ్ళుగా ఎదురు చూస్తున్న జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యులు తమకు ఇకనైనా ప్రభుత్వం ఇళ్ళస్థలాలిచ్చి న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా చేశారు. జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ ( టీమ్ జేఎన్జే ) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో సొసైటీ సభ్యులతో పాటు పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు, సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు. ఈ ధర్నాలో పలువురు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ… జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం జాప్యం చేయడం సరైంది కాదని అన్నారు. 18 ఏళ్ళ క్రితం జవహర్ లాల్ నెహ్రు జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీకి పేట్ బషీరాబాద్, నిజాంపేట్ లలో కేటాయించి స్థలాలను ఆ సొసైటీ సభ్యులకు ఇవ్వకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం అన్యాయమని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా, జర్నలిస్టులకిచ్చిన ఇళ్ల స్థలాల హామీని అమలు చేయకపోవడం బాధాకరమని అన్నారు. 18 ఏళ్ల క్రితం ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు చెల్లించి ఇళ్ల స్థలాల కోసం ఇంతకాలం ఎదురుచూస్తున్న జేఎన్జే హౌసింగ్ సొసైటీ సభ్యులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిజాం పేటలో సర్వే నంబర్ 332లో 32 ఎకరాలు, పేట్ బషీరాబాద్ సర్వే నెంబర్ 25/2 లో 38 ఎకరాల భూమి కేటాయించారని, ఈ భూమిని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం జర్నలిస్టుల ఆశలపై నీళ్లు చల్లడమేనని అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిందని, అంతేకాకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు హామీలిచ్చారని వారు గుర్తుచేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వులు ( జీవో ) జారీ చేసి జేఎన్ జే సొసైటీ సభ్యులకు, అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. సొసైటీ సభ్యులు రమణారావు అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో పాల్గొన్న సభ్యులు తమకు పేట్ బషీరాబాద్, నిజాంపేట స్థలాలనే ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశారు.
సీనియర్ పాత్రికేయులు శాస్త్రి, జూబ్లీహిల్స్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు గోపరాజు, టీఆర్ఎస్ మీడియా విభాగం అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, జేఎన్ జే సొసైటీ నాయకులు అశోక్ రెడ్డి, శ్రీనివాసరావు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి శ్రీనివాస్, టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ సభ్యుడు శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి. రవికుమార్, కో-కన్వీనర్లు ఎం.రవికుమార్, బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.






