హైదరాబాద్, నవంబర్ 3, ( అద్దం న్యూస్ ) : కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతూ, పార్టీ నాయకత్వంపై అచంచలమైన విశ్వాసంతో కొనసాగుతున్న దొమ్మాటి సాంబయ్యకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలని సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ యూత్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టివైజెఎఫ్ ) అధ్యక్షుడు డాక్టర్.జితేందర్ రావు తనుగుల కోరారు. పార్టీ కోసం త్యాగాలు చేసిన నాయకులను గుర్తించడం కాంగ్రెస్ నాయకత్వం బాధ్యత అని అన్నారు. ఎంపీ టికెట్ విషయంలో తొలుత అభ్యర్థిగా ప్రకటించి, అనంతరం కావ్యకు అవకాశం కల్పించినప్పటికీ సాంబయ్య పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఎలాంటి అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయకుండా క్రమశిక్షణతో వ్యవహరించారని.. ఇది ఆయన రాజకీయ నిబద్ధతకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు. పార్టీ కోసం పనిచేసిన నాయకుడికి పదవి దక్కనప్పుడు కూడా విధేయతతో కొనసాగడం సాధారణ విషయం కాదన్నారు. అలాంటి నాయకుడిని గుర్తించి గౌరవించినప్పుడే కార్యకర్తల్లో విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ముఖ్యంగా ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దొమ్మాటి సాంబయ్యకు ఎమ్మెల్సీ అవకాశం కల్పించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, కష్టపడిన నాయకుల పట్ల తన నిబద్ధతకు చాటిచెప్పినట్లవుతుందన్నారు. పదవుల కోసం పార్టీని ఆశ్రయించే నాయకులు కాదు.. పార్టీ కోసం పదవులను త్యాగం చేసే నాయకులే నిజమైన కార్యకర్త అయిన అలాంటి దొమ్మాటి సాంబయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సముచిత గౌరవం కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అధిష్ఠానం మూడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో సాంబయ్య పేరుకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.






