హైదరాబాద్, నవంబర్ 3, ( అద్దం న్యూస్ ) : అలయ్-బలయ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి అధ్యక్షతన హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబుల్లా ఖాన్ హాల్‌లో నషా ముక్త్ భారత్ – నషా ముక్త్ తెలంగాణ అభియాన్ కార్యక్రమం జరిగింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… మాదకద్రవ్యాల వ్యసనం దేశ యువత భవిష్యత్తును, కుటుంబ వ్యవస్థను, సమాజ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తున్న తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. ఈ సమస్యను కేవలం ప్రభుత్వ చర్యలతోనే పరిష్కరించడం సాధ్యం కాదని, సామాజిక సంస్థలు, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, వైద్యులు, యువత అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో స్థానిక పరిస్థితులు, సామాజిక అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, గిరిజన, గ్రామీణ, పారిశ్రామిక, పట్టణ ప్రాంతాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పాఠశాలలు, కళాశాలలు, ఐటీ సంస్థలు, పరిశ్రమల్లో యువతను భాగస్వాములుగా చేసి మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై చైతన్యం కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వకులాభరణం కృష్ణమోహన్, గువ్వల బాల్‌రాజ్, పలువురు వక్తలు పాల్గొన్నారు.







