...

ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు నెంబర్-1 విలన్ కాంగ్రెస్సే – వ‌రంగ‌ల్ బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కెసిఆర్  

ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా
తెలంగాణకు నెంబర్-1 విలన్ కాంగ్రెస్సే 

   – వ‌రంగ‌ల్ బిఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌లో కెసిఆర్  

 

 

తెలంగాణ బ్యూరో, అద్దం న్యూస్ :   ఆనాడైనా, ఈనాడైనా, ఏనాడైనా తెలంగాణకు నెంబర్-1 విలన్ కాంగ్రెస్సే అని మాజీ సీఎం, బిఆర్ఎస్ పార్టీ అధినేత క‌ల్వ‌కుంట్ల కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు అన్నారు. కమీషన్లు తీసుకొనుడు.. సంచులు నింపుడు… సంచులు మోసుడు ఇదే ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన అని ధ్వ‌జ‌మెత్తారు. అన్యాయాన్ని, అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు. రాసి పెట్టుకోండి.. మళ్లీ వచ్చేది బీఆర్ఏస్సే.. ఎవ్వడు ఆపలేడు.. ఎవ్వరి తరం కాదన్నారు. ఆదివారం వ‌రంగ‌ల్ ఎల్క‌తుర్తిలో బిఆర్ఎస్ పార్టీ ర‌జ‌తోత్స‌వ స‌భ ఘ‌నంగా జ‌రిగింది. చీమల దండులా… బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం ముస్తాబైంది. బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం తరలివచ్చారు. కాశ్మీర్, పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మరణించిన భారతీయులకి.. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాళులర్పించారు. ఈ స‌భ‌లో కెసిఆర్ మాట్లాడుతూ…శ్రీరాముడు చెప్పిన “జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరీయసీ” మాటలను స్పూర్తిగా తీసుకోని తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టానన్నారు. నా కళ్లముందే తెలంగాణ ఆగమైతుంటే.. నాకు దుఃఖం కలిగిస్తోందన్నారు. ఢిల్లీ నుండి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చి లేనిపోని హామీలు ఇచ్చారని, చరిత్రలో అన్ని ప్రభుత్వాలు రైతుల నుండి శిస్తు వసూలు చేసినవారే.. కానీ రైతులకు సబ్సిడీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ అని అన్నారు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్య శ్రీని పెట్టాడు.. ఆ పథకం పేదలకు అండగా ఉన్నదని నేను సీఎంగా అయ్యాక ఆ పథకం పేరు కూడా మార్చకుండా కొనసాగించాన‌న్నారు. మేము జేసీబీలు పెట్టి చెరువుల్లో పూడికలు తీస్తే.. కాంగ్రెస్ పార్టీ హైడ్రా అని వాడి బొంద అని పెట్టి పేదల ఇండ్లు కూలగొడుతున్నారని విమ‌ర్శించారు. మోగోడని మొలక అలకడానికి పిలిస్తే ఎలకని చూసి ఎల్లెలికల పడ్డాడంట అన్న చందంగా కాంగ్రెస్ పాల‌న ఉంద‌న్నారు. గోల్‌మాల్ చేయడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదన్నారు. పింఛను రూ.2వేలు ఉంటే కాంగ్రెసోళ్లు రూ.4వేలు ఇస్తామని.. మేం రైతు బంధు రూ.10వేలు ఇస్తే.. రూ.15 వేలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని… చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని అన్నార‌ని… రూ.2 లక్షల రుణమాఫీ ఒక్క సంతకంతో రద్దు చేస్తామని చెప్పారని.. కళ్యాణలక్ష్మి పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పి ఇచ్చారా అని ప్ర‌శ్నించారు. ధాన్యం తడిసినా.. మొలకలు వచ్చిన బిఆర్‌ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసేదన్నారు. బీజేపీ ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ క‌గార్ పేరుతో ఛ‌త్తీస్‌గ‌ఢ్ యువ‌కుల‌ను, గిరిజ‌నులను ఊచ‌కోత కోస్తున్న‌దని… బ‌లమున్న‌ది అని అలా సంపుకుంట పోవుడు కాదు.. అది ప్ర‌జాస్వామ్యం అనిపించుకోదని.. న‌క్స‌లైట్ల‌ను పిలిచి చ‌ర్చ‌లు జ‌ర‌పండని కెసిఆర్ అన్నారు. ఈ స‌భ‌లో బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్సి క‌విత‌, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సిలు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.