వినియోగదారుల హక్కులకు భంగం కలిగితే ఊరుకునేది లేదు

వినియోగదారుల హక్కులకు భంగం కలిగితే ఊరుకునేది లేదు

హైదరాబాద్, అక్టోబ‌ర్ 6, అద్దం న్యూస్ :    వినియోగదారుల హక్కులకు భంగం కలిగితే ఊరుకునేది లేదని ప‌లు ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు హెచ్చరించారు. వినియోగదారుల హక్కుల సంస్థ ఆధ్వర్యంలో హైద‌రాబాద్‌ ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం క‌వాడ‌గూడ డివిజ‌న్ బండమైసమ్మ కమ్యూనిటీహాల్‌లో కిరాణా షాప్ ఓనర్లకు “వినియోగదారుల హక్కుల రక్షణ చట్టం 2019”, “ఆహార భద్రత చట్టం 2006”, “తూనికలు కొలతల చట్టం 2011 ల పై సోమ‌వారం అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఈ సమావేశానికి ప్రభుత్వ అధికారులు, ఏరియా ఫుడ్ సేఫ్టీ అధికారి జిహెచ్ఎంసి అధికారిణి సాహితీ, తూనికలు కొలతల శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఎఫ్ఎస్ఎస్ఏఐ రిటైర్డ్ డిప్యూటీ ఫుడ్ కంట్రోలర్ విజయ్ కుమార్ సమక్షంలో అవగాహన కార్యక్రమం జరిగింది. చిన్న పిల్లలు తినే తిను పదార్థాలు నుంచి వంట సరుకుల వరకు నాసిరకం ఉత్పత్తి, వాటి అమ్మకాలు ఎక్కువైనందున కిరాణా షాప్ యజమానులకు షాప్ లో అమ్ముతున్నటువంటి సరుకుల అమ్మకాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యతలను అధికారులు తెలియచేశారు. చ‌ట్టాల ప్రకారం కొనుగోలు విషయంలో వినియోగదారులకు ఉన్న హక్కులను, షాపు నిర్వాహకులు వాటిని ఉల్లంఘిస్తే విధించే శిక్షలు, జరిమానాల గురించి కవాడిగూడ, గాంధీనగర్, దోమలగూడ బస్తీలలో, కాలనీలలోనీ కిరాణా షాప్ యజమానులకు అధికారులు సూచించారు. 

వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు మాట్లాడుతూ… చుట్టుపక్కల వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపారస్తులు వినియోగదారుల ఆరోగ్యం కోసం ఆలోచించాలని కోరారు. పిల్లలు క్రమం తప్పకుండా నాసిరకం లేదా తక్కువ నాణ్యత గల ఆహారాన్ని తీసుకుంటే, తగినంత పోషకాహారం లేకపోవడం, హానికరమైన పదార్థాల కారణంగా వారు అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారన్నారు. ఆది పిల్ల‌ల‌ శారీరక, మానసిక అభివృద్ధి పై ప్రభావం చూపుతూ తక్షణ సమస్యల నుండి దీర్ఘకాలిక వ్యాధులుగా మారతాయని తెలిపారు. గత నెల నుంచి మేము నిర్వహించిన సర్వేలో నాసిరకం అమ్మకాలు ప్రతి షాప్ లో జరుగుతున్నాయని తేలిందన్నారు. ముఖ్యంగా యజమానులకు అవగాహన లేకపోవడం కారణంగా భావించి ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం ఏ షాప్ లో అయినా సరే ఫుడ్ సేఫ్టీ ( FSSAI ) లైసెన్స్ లేని తిను పదార్థాలు, వంట సర్కులు, లేబుల్ (Declaration) లేని ప్యాక్ చేసిన తిను పదార్థాలు, వంట సర్కులు, తయారీదారుని పూర్తి వివరాలు లేని తిను పదార్థాలు, వంట సరుకులు అమ్మడం కనిపిస్తే సంస్థ తరపున మేమే ఫిర్యాదు చేసి శిక్ష పడేలా చేస్తామని అన్నారు. అలాగే కొల‌త‌ల‌ మిషన్లో హెచ్చుతగ్గులు ఉండడం కొన్న వస్తువులకు వినియోగదారుడు బిల్లు అడిగితే ఇవ్వకపోవడం లాంటివి చేయదని కోరారు. ఈ కార్యక్రమానికి సంస్థ సభ్యుడు ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ యుద్దీన్, రాష్ట్ర కమిటీ సంస్థ సబ్యులు, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page