...

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ స్కీమును యథాతథంగా అమలు చేయాలి

ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ స్కీమును యథాతథంగా అమలు చేయాలి
రూ.8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలి
ఈ నెల 30న తరగతుల బహిష్కరణ,
కలెక్టరేట్లు, ఆర్‌డిఓ, ఎమ్మార్వో కార్యాలయాలు ముట్టడి
– రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య‌

హైద‌రాబాద్‌, జూన్ 27, ( అద్దం న్యూస్ ) :   ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ స్కీమును యథాతథంగా అమలు చేయాలని రాజ్య‌స‌భ స‌భ్యుడు, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్‌.కృష్ణ‌య్య అన్నారు. ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కోసం రూ.8 వేల కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30న తరగతుల బహిష్కరణతో పాటు కలెక్టరేట్లు, ఆర్‌డిఓ, ఎమ్మార్వో కార్యాలయాలు ముట్టడి కార్య‌క్రమాన్ని చేప‌ట్ట‌నున్న‌ట్లు ఆయ‌న తెలిపారు. హైద‌రాబాద్ విద్యాన‌గ‌ర్ బిసి భ‌వ‌న్‌లో జ‌రిగిన స‌మావేశంలో ఆర్‌.కృష్ణ‌య్య మాట్లాడుతూ… ఇంజనీరింగ్, ఫార్మసీ, పీడి, డిగ్రీ తదితర కోర్సులు పూర్తయిన వారికి కాలేజీ యాజమాన్యాలు సర్టిఫికట్టు ఇవ్వడం లేదు.. దీనితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారని తెలిపారు. ఏ కాలేజికి వెళ్ళి చూసిన విద్యార్థులు ఫీజులు కట్టలేక నరకయాతన అనుభవిస్తుంటే ప్రభుత్వం సంతోషంగా ఉందని విమ‌ర్శించారు.

ఇటీవల ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ 9 తో స్పష్టత లేకపోవడం వలన తీవ్ర గందరగోళం ఏర్పడుతుందన్నారు. ఫీజులు విద్యార్థుల ఖాతాలోకి వేస్తామని పేర్కొనడంతో కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టమని ఒత్తిడి తెచ్చే అవకాశం ఉందని, పైగా ప్రభుత్వం ఫీజులు విద్యార్థులు కట్టకపోతే రెవెన్యూ రికవరీ యాక్ట్ క్రింద అరెస్టు చేస్తామని భయపెట్టడంతో విద్యార్థులలో భయందోళనలు-చదువు పట్ల అనాసక్తి ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 33 నెలలు గడుస్తుంద‌ని, ఇప్పటికే 4 లక్షల కోట్లు అప్పు తెచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బడ్జెట్‌ను విడుదల చేయాలని… లేకపోతే జులైలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని పిలుపునిచ్చారు. జాతీయ బిసి సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.అరుణ్ కుమార్, రాష్ట్ర బీసి యువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అంజి, రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ల ఆధ్వర్యంలో జరిగిన ఈ స‌మావేశంలో 14 సంఘాల నాయకులతో పాటు బిసి విద్యార్థి సంఘం క‌న్వీన‌ర్ మోది రాందేవ్‌, బిసి కులాల ఐక్య వేదిక అధ్య‌క్షుడు అనంత‌య్య త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.