రాంనగర్, నవంబర్ 17, ( అద్దం న్యూస్ ) :
“ సే నో టు డ్రగ్స్ ” ప్రచారంలో భాగంగా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దేశ వ్యాప్త కార్ ర్యాలీకి నాయకత్వం వహించిన స్వచ్ఛంద సంస్థ ( NGO ) “ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ ” వ్యవస్థాపకురాలు స్నేహ అయ్యగారి ని, ఆమె బృందాన్ని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సన్మానించారు. మంగళవారం హైదరాబాద్ రాంనగర్లోని దత్తాత్రేయ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది. “ హోమ్ అవే ఫ్రమ్ హోమ్ ” అనేది భారతదేశం అంతటా సమాజ సంక్షేమం, యువత సాధికారత, సామాజిక అవగాహన కార్యక్రమాల కోసం అంకితమైన ఒక స్వచ్ఛంద సంస్థ అని బండారు దత్తాత్రేయ అన్నారు. గత నెల 24వ తేదీన ప్రారంభమైన ఈ యాత్ర, భారత ప్రభుత్వ ‘ నశా ముక్త్ భారత్ అభియాన్ ’ ( డ్రగ్-ఫ్రీ ఇండియా క్యాంపెయిన్ ) కు అనుగుణంగా విద్యార్థులు, యువతకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించడానికి చేపట్టడం జరిగిందన్నారు.
క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంలో బృందం చూపిన అంకితభావాన్ని, వివిధ రాష్ట్రాల యువత ఆరోగ్యకరమైన, వ్యసన రహిత జీవితాలను గడిపేలా స్ఫూర్తినివ్వడంలో వారు చేసిన కృషిని దత్తాత్రేయ ప్రశంసించారు. ఈ ప్రచారంలో క్రియాశీలక పాత్ర పోషించినందుకు గాను ప్రముఖ గాయకుడు ప్రదీప్ మీనన్, మలయాళ చలనచిత్ర నటుడు రంజిత్ మీనన్, మలయాళ చలనచిత్ర నటి అప్సర తదితరులను సన్మానించారు.








