శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా గణేశ్ శర్మ

 

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా గణేశ్ శర్మ

ఈనెల 30 న గణేశ శర్మకు సన్యాసాశ్రమ దీక్షను అనుగ్రహించనున్న శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి

 

సికింద్రాబాద్, ఏప్రిల్ 27, అద్దం న్యూస్ :  శ్రీ కంచికామకోటి పీఠం 71 వ పీఠాధిపతిగా వేద విద్వాంసులు, శ్రీ దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రావిడ్ ను కంచి కామకోటి శంకరాచార్య శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి ఎంపిక చేశారు. ఈ మేరకు ఈనెల 30వ తేదీన అక్షయ తృతీయ పర్వదినాన, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి, శ్రీ గణేశ శర్మకు సన్యాసదీక్షను అనుగ్రహిస్తారు. కంచి కామకోటి పీఠం 71 వ పీఠాధిపతిగా ఎంపికైన రుగ్వేద పండితుడు, శ్రీ గణేశ శర్మ ఆంధ్రప్రదేశ్‌లోని అన్నవరంలో 1999 ఏప్రిల్ 29న జన్మించారు. వారి తల్లిదండ్రులు దేవి, ధన్వంతరి. సన్యాస దీక్ష అనంతరం వారు కొత్తగా సన్యాసాశ్రమ నామాన్ని స్వీకరిస్తారు. ప్రస్తుత 70 వ కంచికామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు 1983లో సన్యాసాశ్రమం స్వీకరించారు, 2018లో పీఠాధిపతి అయ్యారు. కంచి కామకోటి పీఠం దేశంలో అత్యంత ప్రముఖ శంకర పీఠంగా విరాజిల్లుతున్నది. వేదవిజ్ఞానాన్ని నలుచెరగులా వ్యాప్తి చేయడమే కాకుండా పలు విద్యా సంస్థలను నిర్వహిస్తూ, పలు సామాజిక సంక్షేమ కార్యక్రమాలను పీఠం చేపడుతున్నది.

ద్వారకా తిరుమల నుంచి కంచికామకోటి పీఠాధిపతిగా :

గణేశ శర్మ ఆంధ్రప్రదేశ్‌లోని ద్వారకా తిరుమలలో ప్రఖ్యాత వేద పండితులు రత్నాకర్ భట్ వద్ద రుగ్వేదాన్ని అభ్యసించారు. శృంగేరి, ఇతర పీఠాలు నిర్వహించిన పలు పరీక్షలలో వారు ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సరాల క్రితం నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ ఆలయంలో ఆస్థాన రుగ్వేద పండితులుగా నియమితులయ్యారు. గణేశ శర్మ కుటుంబానికి కంచి పీఠంతో ఎంతో కాలంగా సంబంధం ఉన్నప్పటికీ, 2024లో విజయేంద్ర సరస్వతి స్వామివారు బాసర సందర్శించినపుడు, గణేశ శర్మలో గల ప్రత్యేకతలను గుర్తించి కంచికామకోటి పీఠానికి ఆహ్వానించి మరిన్ని శాస్త్రాలు నేర్చుకోవలసిందిగా కోరారు. శ్రీ గణేశ శర్మ కంచి పీఠం 71 వ పీఠాధిపతిగా ఎంపిక కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page