కల్తీ కల్లు తాగి ప్రజలు చనిపోతుంటే మంత్రులు స్పందించరా
– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు సాయిబాబా

హైదరాబాద్, జులై 9, అద్దం న్యూస్ : హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలైన కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్, నడిగడ్డతండా ప్రాంతాలకు చెందిన 15 మంది ఆదివారం కలుషితమైన కల్తీ కల్లు తాగి 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారని, ముగ్గురు చనిపోతే మంత్రులు స్పందించరా అని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. బుధవారం హైదరాబాద్ నగర టిడిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కల్తీ కల్లు తాగి బీపీ పడిపోవడం, తీవ్రమైన వాంతులు, విరేచనాలు, కొందరిలో స్పృహ కోల్పోవడం వంటి సమస్యలతో తీవ్ర అస్వస్థతకు లోనయ్యారన్నారు. దీంతో వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారన్నారు. బాధితుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉంటే తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 3 కు చేరుకోవడం ఆందోళన కలిగిస్తుందని, ప్రజల ప్రాణాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. బాధితులకు ఆదివారం నుంచి మూత్రం సరిగా రావడం లేదని, దీని వల్ల కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడిందని వైద్యులు గుర్తించారన్నారు. రక్తంలో క్రియాటినైన్ స్థాయులు ప్రమాదకరంగా పెరగడంతో మెరుగైన చికిత్స కోసం, డయాలసిస్ నిర్వహించేందుకు వీలుగా వారందరిని నిమ్స్ ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఈ ఘటనపై మేడ్చల్ జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ ఉమ, స్థానికి శాసనసభ్యుడు ఆసుపత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. కానీ ప్రభుత్వం తరఫున అధికారికంగా భాధితులను పరామర్శించిన నాథుడే లేడని అన్నారు. నగరంలో మంత్రులు ఉన్నారా లేదా అని ప్రశ్నించారు. ఇంచార్జ్ మంత్రి కూడా బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పి, మనోస్థైర్యం కల్గించాల్సిన అధికారులు మంత్రులు ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికే ముగ్గురు మృతి చెందగా, చికిత్స పొందుతున్న వారికి మెరుగైన చికిత్స అందించడానికి ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని సాయిబాబా దుయ్యబట్టారు. అదే విధంగా పబ్బులలో కూడా విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు మత్తు పదార్థాలు సేవించి పెద్ద ఎత్తున యువత నిర్వీర్యం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసారు. పబ్బులను తనిఖీ చేసి వాటి అక్రమాలను నియంత్రించే వారే కరువయ్యారని అన్నారు. పరోక్షంగా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో త్యాగాల తెలంగాణను మత్తు పధార్థాలు, మాదక ద్రవ్యాలకు రాజధానిగా మారుస్తున్నారన్నారు. ప్రజల ప్రాణాలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి భద్రత లేదని సామాన్యుడు బాధపడుతున్నారన్నారు. ఎంతసేపు తన పదవి కాపాడుకునే ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి, విహర యాత్రల్లో సహచర మంత్రులున్నారని, ముఖ్యమంత్రికి ఢిల్లీ పర్యటనలకే పరిమిత మౌతుంటే, సహచర మంత్రులకు విహార యాత్రలకు సమయం సరిపోతుందన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల కష్టాలను పట్టించుకునే తీరిక లేనప్పుడు ప్రభుత్వం ఉంది ఎందుకు దండగ అని వాపోయారు. చాలాకాలంగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఘటనపై నిస్పక్షపాతంగా ధర్యాప్తు చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు నల్లెల్ల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply