...

హైదరాబాద్‌లో అక్రమాలు –పేదోడి పై ప్రతాపం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, నవంబర్ 22, అద్దం న్యూస్ :    తెలంగాణ ప్రభుత్వ వైఫల్యం కార‌ణంగా హైదరాబాద్‌లో అక్రమాలు జోరుగా సాగుతున్నాయ‌ని, పేదోడిపై ప్రతాపం చూపుతున్నారు కానీ.. బడా బాబుల బకాయిలు లక్షలు ఉన్నా జిహెచ్ఎంసి కళ్ళు మూసుకుంద‌ని టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ అధ్య‌క్షుడు పి.సాయిబాబా అన్నారు.‘విశ్వనగరం’ పేరుగాంచిన హైదరాబాద్‌ నగరంలో అక్రమ కట్టడాలు కడుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే దోపిడీ యథేచ్ఛగా సాగుతోందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు, స్వార్థపరులైన జీహెచ్ఎంసీ అధికారులే కారణమని మండిపడ్డారు. శ‌నివారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో జ‌రిగిన విలేక‌రుల‌ స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… నగర శివారు ప్రాంతాల్లో, ముఖ్యంగా కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా బడా కాంట్రాక్టర్లు పర్మిషన్ ఒకటి తీసుకుని, అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నా.. జీహెచ్ఎంసీ అధికారులకు కనీసం చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం దారుణమైన విషయం అన్నారు. కేవలం స్వార్థపరులైన కొంతమంది అధికారుల ‘ఆమ్యామ్యాల’ ఫలితమే అని అన్నారు. ఇందులో ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల రాజకీయ ప్రమేయం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, చూసీ చూడనట్టు వ్యవహరించడానికి డబ్బులే ప్రధాన కారణమ‌న్నారు.

పేదోడిపై ఒక న్యాయం – పెద్దోడికి ఒక న్యాయం :

ఒకవైపు అదే విశ్వనగరంలో, ఒక పేదవాడు కనీసం 50 గజాల్లో చిన్న ఇల్లు కట్టుకుంటే, మున్సిపల్ అధికారులు వెంటనే దాన్ని ‘అక్రమ నిర్మాణం’ అంటూ కూల్చేస్తున్నారని.. మరి ఇంత కంటే పెద్ద ఎత్తున, అనుమతులు లేకుండా నిర్మిస్తున్న బహుళ అంతస్తులు అధికారుల కళ్లకు కనిపించడం లేదా ? అని సాయిబాబా ప్ర‌శ్నించారు. ఇది పేద, ధనిక తేడా చూపిస్తున్న తెలంగాణ ప్రభుత్వ పాలనకు నిదర్శనమ‌న్నారు.

స్టూడియోల పేరుతో ప్రభుత్వ ఖజానాకు గండి :

రామానాయుడు. అన్నపూర్ణ స్టూడియోస్ వంటి పెద్ద సంస్థలు ట్రేడ్ లైసెన్స్ ఫీజులను దశాబ్దాలుగా తక్కువగా చెల్లిస్తూ జీహెచ్ఎంసీ ఆదాయానికి కోట్లాది రూపాయల గండి కొట్టడం వెలుగులోకి వచ్చిందన్నారు. అన్నపూర్ణ స్టూడియో రూ. 11.52 లక్షలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ. 49 వేలు మాత్రమే చెల్లించడం, అలాగే రామానాయుడు స్టూడియో రూ. 1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.1,900 మాత్రమే చెల్లించడం ఎంత దారుణం అని అన్నారు. ఈ అవినీతి దోపిడీ కార్యక్రమానికి ఎవరు అండదండలున్నాయో ప్రజలందరికీ అర్థమవుతోందన్నారు. ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అక్రమాల్లో భాగస్వాములైన అధికారులందరిపైనా తక్షణమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న వివాదాస్పద అధికారుల ఆస్తులపై తక్షణం సమగ్ర విచారణ చేయించాలని అన్నారు. హైదరాబాద్ మహానగరానికి మచ్చ తెచ్చే రీతిలో ప్రవర్తిస్తున్న స్వార్థపరులైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అక్రమాలన్నింటి వెనుక ఉన్న అసలు కారణం ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యమే. ఇటువంటి వైఫల్యాల వల్ల ప్రభుత్వాలపై ప్రజలకు విశ్వసనీయత కోల్పోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి న‌గ‌ర నాయ‌కులు నల్లెల్లకిషోర్, బాలరాజు గౌడ్, ఎస్.ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.