హైదరాబాద్ బ్యూరో, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాపితంగా 12769 గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న సుమారు 60 వేల మంది కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు అన్నింటిని వెంటనే చెల్లించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ) తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (టియుసిఐ) రాష్ట్ర కార్యవర్గ సమావేశం హైదరాబాద్ విద్యానగర్ మార్క్స్ భవన్‌లో జరిగింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొత్తపల్లి రవి అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా కె.సూర్యం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలన అంటూ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేస్తూ కొవ్వొత్తిలా కరిగిపోతున్న సిబ్బంది సమస్యలు పట్టవా అని అన్నారు. గ్రీన్ ఛానల్ పేరుతో సిబ్బంది వివరాలన్నీ తీసుకొని నాలుగు నెలలు గడిచిన నేటికీ వారికి వేతనాలు అందడం లేదని అన్నారు. పేద దళిత, గిరిజన బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన కార్మికులు నాలుగు నెలలు జీతాలు లేకుండా ఏమి తిని బతకాలని ఆయన ప్రశ్నించారు. పంచాయతీ కార్మికులు చేసిన శ్రమకు అనేక జాతీయ అంతర్జాతీయ అవార్డులు వస్తున్న అందుకు కారకులైన కార్మికుల కడుపులు కాలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 2016లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కార్మిక వర్గ పోరాటాలతో ప్రశ్నించాలని అన్నారు. రేపు ప్రవేశ పెట్టనున్న తెలంగాణ వార్షిక బడ్జెట్‌లో గ్రామపంచాయతీలకు అధికంగా నిధులు కేటాయించి.. కార్మికుల సమస్యలను పరిష్కారానికి పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్‌ల అమలు వల్ల ఉన్న అన్ని రకాల హక్కులను కోల్పోతున్నారని, ఇది కార్మిక వర్గంపై మోడీ సర్కార్ చేసిన అతి పెద్ద కుట్ర అని అభివర్ణించారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాల అమలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల సమస్యల పరిష్కారానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ నెల 12 నుంచి 17 వరకు మండల కేంద్రాలలో భిక్షాటన చేయనున్నామని, 18న కలెక్టరేట్ల ముందు ధర్నాలు, కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వెంకటి, ఏ.నరసింహ, రాందాసు, ఏదుట్ల కురుమయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాడియా బీకు, గట్టమ్మ, చందు, రాములు, నరసింహ తదితరులు పాల్గొన్నారు.














Leave a Reply