న్యాయవాదుల రక్షణ చట్టం–2026తో న్యాయవాదులకు రక్షణ
– తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 3, ( అద్దం న్యూస్ ) : న్యాయవాదుల రక్షణ చట్టం–2026తో న్యాయవాదులకు రక్షణ జరుగుతుందని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన కవాడిగూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల భద్రతకు భరోసా కల్పిస్తూ రూపొందించిన అడ్వకేట్ల పరిరక్షణ చట్టం–2026 అమల్లోకి వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేస్తూ మంగళవారం జీఓ 14ను అధికారికంగా నోటిఫై చేయడం హర్షణీయమని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. వృత్తిపరమైన విధుల్లో ఉన్న న్యాయవాదులపై దాడులు, వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో వారి రక్షణ కోసం ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో తెలంగాణ అడ్వకేట్ల పరిరక్షణ బిల్లు–2026 ను ఆమోదించిందని తెలిపారు. గవర్నర్ ఆమోదం పొందిన ఈ చట్టం ఇప్పుడు అమల్లోకి వచ్చిందని పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం న్యాయవాదులకు పోలీస్ రక్షణ, తప్పుడు కేసుల నుంచి భద్రత, వేధింపులపై ఫిర్యాదుల కోసం ప్రత్యేక యంత్రాంగం, బెదిరింపుల నుంచి రక్షణ వంటివి కల్పిస్తారన్నారు.
అదే విధంగా న్యాయవాదుల వృత్తి ధర్మానికి, చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్రవర్తిస్తే వారికి కూడా శిక్షలు ఉంటాయన్నారు. న్యాయవాదులు లేదా వారి కుటుంబసభ్యుల పై భౌతిక దాడులు, బెదిరింపులకు గురి చేయడం లేదా దుర్భాషలాడటం వంటి చర్యలకు శిక్షలు ఉంటాయన్నారు. న్యాయవాదులపై దాడికి పాల్పడే వారికి ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్షతో పాటు కనీసం రూ.25 వేల వరకు జరిమానా విధిస్తారన్నారు. ఒక వేళ సదరు వ్యక్తి మరోసారి నేరానికి పాల్పడితే ఆ శిక్షను ఒకటి నుంచి ఏడేళ్ల వరకు పొడిగించేలా, రూ. 50 వేల నుంచి లక్షల రూపాయల వరకు జరిమానా వసూలు చేసేలా చట్టంలో నిబంధనలు చేర్చారని గోవర్థన్‌రెడ్డి తెలిపారు. న్యాయవాదులను అరెస్టు చేయాల్సి వస్తే.. తప్పనిసరిగా సంబంధిత న్యాయస్థానం నుంచి అనుమతి ( జ్యుడిషియల్ ఆర్డర్ ) పొందాల్సి ఉంటుందన్నారు. దీని వల్ల న్యాయవాదుల అక్రమ అరెస్టులు, కక్ష సాధింపులకు చెక్ పడనుందని తెలిపారు.













Leave a Reply