స్టార్ ఆటగాళ్ల సందడి..

స్టార్ ఆటగాళ్ల సందడి..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: విజయ్ హజారే ట్రోఫీ (Vijay Hazare Trophy) అంటే అభిమానుల్లో పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. టోర్నీ ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు ముగిసిందో కూడా చాలామందికి తెలిసేది కాదు. కానీ, ప్రస్తుతం భారత జట్టులో ఉన్న క్రికెటర్లందరూ కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని బీసీసీఐ షరతు విధించడంతో ఈ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీకి కొత్త కళ వచ్చింది. స్టార్ ఆటగాళ్లు తమ తమ రాష్ట్రాల జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు. డిసెంబరు 24 నుంచి మొదలుకానున్న ఈ టోర్నమెంట్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషభ్‌ పంత్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మతోపాటు మరికొంత మంది స్టార్ ప్లేయర్లు సందడి చేయనున్నారు. కోహ్లీ 15 ఏళ్ల తర్వాత విజయ్‌ హజారే ట్రోఫీలో ఆడుతుండటం విశేషం.

మళ్లీ రో-కో ఫైర్ చూస్తామా..?

ముంబయికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ శర్మ (Rohit Sharma).. డిసెంబర్ 24, 26న సిక్కిం, ఉత్తరాఖండ్‌తో మ్యాచ్‌ల కోసం జైపుర్ చేరుకున్నాడు. రోహిత్ ఇప్పటివరకు ఈ టోర్నీలో 18 మ్యాచ్‌లు ఆడి 600 రన్స్ చేశాడు. 2005-06 సీజన్‌లో వెస్ట్ జోన్‌కు ఆడిన హిట్‌మ్యాన్.. నార్త్ జోన్‌పై 142 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తోనే దేశవాళీ క్రికెట్‌లో రోహిత్ వెలుగులోకి వచ్చాడు. ఇక, కొన్ని రోజుల కిందట లండన్ నుంచి భారత్‌కు చేరుకున్న కోహ్లీ (Virat Kohli) ముంబయిలో ముమ్మరంగా ప్రాక్టీస్ చేశాడు. దిల్లీకి ఆడనున్న కోహ్లీ.. ఆంధ్రతో మ్యాచ్‌ కోసం బెంగళూరు వెళ్లాడు. విజయ్ హజారే (Vijay Hazare Trophy)లో ‘కింగ్‌’కు మంచి రికార్డు ఉంది. 2008-9 సీజన్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగు శతకాలు బాది 534 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాతి సీజన్‌లో ఐదు మ్యాచ్‌లు ఆడి 229 రన్స్ చేశాడు. ఇటీవల సఫారీలతో వన్డే సిరీస్‌లో రాణించిన రో-కో విజయ్‌ హజారే ట్రోఫీలోనూ అలరించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

కొత్త పేసర్లు వెలుగులోకి వస్తారా?

విజయ్ హజారే ట్రోఫీలో ప్రతిభావంతులైన యువ పేసర్లు వెలుగులోకి వస్తారని సెలక్టర్లు ఆశిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రంజీ ట్రోఫీలో రాణించిన మహ్మద్‌ సిరాజ్.. తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని భారత జట్టులో రెగ్యులర్‌ ఆటగాడిగా మారాడు. సిరాజ్ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో మరో కొత్త పేసర్ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా, ఆకాశ్ దీప్ వంటి పేసర్లు వెలుగులోకి వచ్చినా వారిలో నిలకడ లేదు. గుర్జప్నీత్ సింగ్ (తమిళనాడు), గుర్నూర్ బ్రార్ (పంజాబ్), యుధ్వీర్ సింగ్ (జమ్మూ కశ్మీర్), అనుజ్ థక్రాల్ (హరియాణా), సాకిబ్ హుస్సేన్ (బిహార్) ఈ టోర్నీలో రాణిస్తారనే అంచనాలున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page