...

తెలంగాణాను డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలి –  విజృంభిస్తున్న డ్రగ్స్ మాఫియా పై చ‌ర్య‌లేవి – టిడిపి నాయకుల ధ్వ‌జం

తెలంగాణాను డ్రగ్స్ రహిత నగరంగా మార్చాలి
–  విజృంభిస్తున్న డ్రగ్స్ మాఫియా పై చ‌ర్య‌లేవి
– టిడిపి నాయకులు 

హైదరాబాద్, ఫిబ్రవరి 16, అద్దం న్యూస్ :   తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా కార్యకలాపాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని, దీనిపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ( టీడీపీ ) సీనియర్ నాయకులు నల్లెల కిషోర్, నగు నగేష్, పి.బాలరాజ్ గౌడ్ లు డిమాండ్ చేశారు. సోమవారం దోమ‌ల‌గూడ‌లోని సికింద్రాబాద్‌ పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన విడుదల చేస్తున్న సందర్బంగా వారు మాట్లాడుతూ… రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలు మరియు వినియోగంపై గణాంకాలను విడుదల చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. 2024లో 2,387 డ్రగ్స్ కేసులు నమోదై, 5,463 మంది అరెస్టు కాగా, 2025లో కేవలం 11 నెలల కాలంలోనే కేసుల సంఖ్య 8,000 మార్కును దాటడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోందని వారు పేర్కొన్నారు. సుమారు 172 కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకోవడం గమనార్హం అన్నారు. హైదరాబాద్‌లోని వాఘ్దేవి ల్యాబ్స్‌లో రూ.12,000 కోట్ల విలువైన ఎండి డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఛేదించడం, అలాగే మల్నాడు రెస్టారెంట్ వంటి కేంద్రాల నుండి కోకేన్, ఎక్స్టసీ పిల్స్ సరఫరా కావడం వంటి ఘటనలు డ్రగ్స్ మాఫియా వేళ్లూనుకుపోయిందని నిరూపిస్తున్నాయని వారు విమర్శించారు.

డ్రగ్స్ మాఫియా ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకుంటోందని, ఇటీవలే ఒక ఇంజనీరింగ్ విద్యార్థి బెంగళూరు నుండి ఎండీఎంఏ ( MDMA ) డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడటం కలచి వేసే విషయమన్నారు. 2017లో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖుల పేర్లు బయటపడినప్పటికీ, ఇప్పటికీ వారిపై పెద్దగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేవలం విచారణలకే పరిమితం కాకుండా, బాధ్యులను కఠినంగా శిక్షించాలని టిడిపి నేత‌లు డిమాండ్ చేశారు. డ్రగ్స్ వాడకం సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా స్కూళ్లు, కళాశాలల్లో యువతను లక్ష్యంగా చేసుకుంటోందన్నారు. డ్రగ్స్ వల్ల హింస, అనారోగ్యం, నైతిక విలువల పతనం జరిగి. కుటుంబాలు కూలిపోతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆర్థిక-మానసిక సమస్యలు పెరుగుతున్నాయని, నేరాలు భారీగా పెరిగాయన్నారు. 40 ఏళ్ల లోపం యువతలో 14,000 మంది NDPS కేసుల్లో పడ్డారని.. యువతకు అవగాహన సదస్సులు నిర్వహించి వారి భవిష్యత్తును కాపాడాలన్నారు.

ఈగల్ ( Elite Action Group for Drug Law Enforcement ), యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వంటి విభాగాలను మరింత బలోపేతం చేసి, డ్రగ్స్ మూలాలను వెలికితీయాలన్నారు. బెంగళూరు త‌దితర ప్రాంతాల నుండి, అలాగే అంతర్జాతీయంగా నైజీరియన్ ముఠాల నుండి అందుతున్న సరఫరా గొలుసును పూర్తిగా తెంచివేయాలన్నారు. నకిలీ మందులు, హ్యాబిట్-ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయించే మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ( DCA ) నిరంతర నిఘా ఉంచాలని పేర్కొన్నారు. పబ్బులు, ఈవెంట్లు, ప్రైవేట్ పార్టీలపై నిఘా పెంచి, న్యూ ఇయర్ వంటి వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగం లేకుండా ‘జీరో డ్రగ్స్ పాలసీ’ని పక్కాగా అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేసారు. రాష్ట్రం డ్రగ్స్ రహితంగా మారాలంటే కేవలం పోలీసుల చర్యలే కాకుండా ప్రజలు, ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచి అధికారులకు సహకరించాలని టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తడక వినోద్, సుదర్శన్ రెడ్డి, శ్యామ్ సుందర్, పి.వంశీకృష్ణ, భాను ప్రకాష్, కరణం కిరణ్, ఎస్.ప్రకాష్, జోగిందర్ సింగ్, తదితర నాయకులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.