నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
– ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర కమిటీలు
హైదరాబాద్, సెప్టెంబర్ 10, అద్దం న్యూస్ : గ్రూప్ వన్ పరీక్షల అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, వివాదాలకు నిలయంగా ఉన్న టీజీ పీఎస్‌సిని ప్రక్షాళన చేయాలని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు, కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ ( ఎస్ఎఫ్ఐ ) భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య ( డివైఎఫ్ఐ ) తెలంగాణ రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో హైదరాబాద్ బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్క్ వద్ద నిరసన ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రూప్ వన్ పరీక్ష గతంలోనే టీజీ పీఎస్‌సి చేసిన తప్పిదాల వల్ల రెండుసార్లు ప్రిలిమ్స్ రద్దు కావడం జరిగిందన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో టీజీ పీఎస్‌సి నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష హాల్ టికెట్ల దగ్గర నుండి పరీక్ష పూర్తయి మూల్యాంకనం వరకు వరుస వివాదాలతో టీజీ పీఎస్‌సి కేంద్ర బిందువు అయిందన్నారు. నిరుద్యోగ యువత లక్షలాది రూపాయలు కోచింగ్ సెంటర్లలో వేచించి ప్రిపేర్ అయ్యి పరీక్షలకు హాజరవుతుంటే పారదర్శకంగా నియమాకాలు చేపట్టాల్సిన టీజీ పీఎస్‌సి దానికి బదులు వివాదాలకు సృష్టించే విధంగా వ్యవహరిస్తూ రాష్ట్రంలోని నిరుద్యోగులు జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా టీజీ పీఎస్‌సిని యుపిఎస్సి తరహాలో తీర్చిదిద్దుతామని చెప్పి ప్రగల్బాలు పలికి వరుస తప్పిదాలతో పారదర్శకంగా నియమాకాలు చేపట్టకుండా లక్షలాదిమంది నిరుద్యోగ యువత ను మోసం చేస్తుందన్నారు. పరీక్ష నిర్వహించినప్పటి నుండి అనేకమైన అనుమానాలకు తావిచ్చిన టీజీ పీఎస్‌సి పై రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష నిర్వహించలేదన్నారు. పరీక్ష పత్రాలని నిపుణులైన ప్రొఫెసర్లతో మూల్యాంకనం చేయించాలని, తెలుగు మీడియం పేపర్లను తెలుగు మీడియం వారితోనే చేయించాలని ఇంగ్లీష్ మీడియం పేపర్లను ఇంగ్లీష్ మీడియం సంబంధించిన నిపుణులతో మూల్యాంకనం చేయించాలని నిబంధనలు ఉన్న నిబంధనలను పాతరేస్తూ టీజీ పీఎస్‌సి వ్యవహరించిందన్నారు. గ్రూప్ వన్ పరీక్షల్లో అవకతవకలపై ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, సబ్జెక్టు నిపుణులతోనే జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టాలని గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి అడ్డంకులు లేకుండా పారదర్శకంగా నియామకాలు చేపట్టే విధంగా మళ్లీ పరీక్షను నిర్వహించాలని, టీజీ పీఎస్‌సిని ప్రక్షాళన చేసి.. టీజీ పీఎస్‌సిలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్రంలో అత్యున్నత స్థాయి కమిషన్ గా ఉన్న టీజీ పీఎస్‌సి పై నమ్మకం ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేంత వరకు పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ రాష్ట్ర నాయకులు డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి, ఎండి జావీద్, శంకర్, మమత, ప్రశాంత్, రమేష్, రాజయ్య, విజయ్ కుమార్, లెనిన్, స్టాలిన్, నాగేందర్, శంకర్, సహన తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply