సాయంత్రం ఐదు గంటలు. ఎండ తగ్గంగనే ఊరంతా ఒక్కొక్కలుగ అరుగుల మీదికి చేరేది. చేను నుంచి వచ్చిన రైతు భుజం మీది తువ్వాలుతో చెమట తుడుచుకుంటూ కూర్చునేది.
పక్కింటి పెద్దాయన చుట్ట అంటించేది. ఆడోళ్లు ఇంకో అరుగు మీద కూరగాయలు కోసుకుంటూ ముచ్చట్లు పెట్టేది. పిల్లలు ముందు వాకిట్ల గోలీలు, బొంగరాలు.
ఎవ్వలి ఇంట్ల బిడ్డకు సంబంధం కుదిరిందో, ఎవ్వలి పొలంల పురుగు పట్టిందో, ఎవ్వలి ఆవు ఈనిందో ఊరి వార్తలన్నీ ఆ అరుగు మీదనే పుట్టేటియి.
అరుగు అంటే రెండు అడుగుల ఎత్తు మట్టి గద్దె కాదు. అది ఊరి గుండె.
ఇయ్యాల అదే వీధిల నడిచి చూడండి. పాత ఇండ్లు కూలగొట్టి కొత్తవి కట్టిండ్రు. ఎత్తైన కాంపౌండ్ గోడలు, ఇనుప గేట్లు, గేటుకు తాళం. అరుగు లేదు.
ఉన్న కొన్ని అరుగుల మీద దుమ్ము, ఎండిన ఆకులు. కూర్చునేటోళ్లు లేరు.
అందరూ లోపల ఉన్నరు. టీవీ ముందో, ఫోన్ తెర ముందో.
ఊర్లె మనుషులు పెరిగిండ్రు కానీ కలుసుకునే చోటే మాయమైంది.
పాత రోజుల్ల రచ్చబండ దగ్గర వేపచెట్టు కింద సభ పెడితే ఊరంతా వచ్చేది. పెద్దోళ్లు గట్టిగ మాట్లాడేది, గొడవలు అయ్యేటియి, కానీ చివరికి ఆ బండ మీదనే పరిష్కారం దొరికేది.
రెండు కుటుంబాల మధ్య పొలం గట్టు తగాదా పోలీస్ స్టేషన్ దాకా పోకుండ, నలుగురు పెద్దల మాటతో అక్కడనే తెగిపోయేది. ఇప్పుడు అదే గ్రామసభకు సంతకాల కోసం మనుషులను పిలుసుకొని రావాల్సి వస్తది.
రచ్చబండ ఉంది. కానీ రచ్చ లేదు, బండ మీద మనుషులూ లేరు.
అమెరికన్ సోషలోజిస్ట్ రే ఓల్డెనబుర్గ్ ఒక మాట చెప్పిండు మనిషికి మూడు స్థలాలు కావాలె. మొదటిది ఇల్లు, రెండోది పని చేసే చోటు, మూడోది ఇద్దరు మనుషులు ఏ పనిలేకుండ, ఏ లాభంలేకుండ ఊరికే కలిసికూర్చునే చోటు. దాన్ని ఆయన థర్డ్ ప్లేస్ అన్నడు. అమెరికాల అది కాఫీషాప్, బార్బర్ షాప్. మన ఊర్లె అది అరుగు, రచ్చబండ, చెరువు గట్టు, గుడి మెట్లు.
రాబర్ట్ పుట్నామ్ అనే ఇంకో పెద్దాయన బౌలింగ్ అలోన్ అనే పుస్తకంల రాసిండు, ఈ మూడో స్థలం చచ్చి పోయిన సమాజంల మనుషుల మధ్య నమ్మకం తగ్గిపోతది, ఒంటరితనం పెరుగుతది, చిన్న గొడవ కూడా పెద్ద యుద్ధమైతది. మన పెద్దలకు ఇది వేల ఏండ్ల కిందనే తెలుసు.
ఋగ్వేదంల సభ, సమితి అని ప్రజలు కలిసి కూర్చునే సమావేశాలు ఉండేటియి. ఋగ్వేదం చివరి సూక్తంల ఒక ప్రార్థన ఉంది “సంగచ్ఛధ్వం సంవదధ్వం సం వో మనాంసి జానతామ్” కలిసి నడవండి, కలిసి మాట్లాడండి, మీ మనసులు ఒక్కటి కావాలె. కలిసి మాట్లాడు కుంటేనే మనసులు కలుస్తయి అని మన పూర్వీకులు నమ్మిండ్రు. ఆమాట్లాడుకునే చోటే అరుగు.
ఇయ్యాల మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఊరి గ్రూప్ ల రెండు వందల మంది సభ్యులు. పొద్దున్నే “గుడ్ మార్నింగ్ ” పువ్వుల బొమ్మలు, దేవుళ్ల ఫోటోలు, ఫార్వర్డ్ మెసేజీలు. కానీ ఆ గ్రూప్ ల ఉన్న పక్కింటాయన ఒంట్లె బాగోలేక మూడు రోజుల నుంచి బయటికి రాలేదని ఎవ్వలికీ తెలువది.
అరుగు మీద అయితే రెండో రోజే తెలిసేది “ఏందిరా, మీ నాయిన కనిపిస్తలేడు?” అని ఎవ్వలో ఒక్కలు అడిగేది. గ్రూప్ ల మెసేజీలు ఉంటయి. అరుగు మీద మనసులు ఉండేటియి.
అరుగు మీద కూర్చున్న ముసలాయన ఊరంతటికీ కాపలా. ఎవ్వలు వస్తున్నరు, ఎవ్వలు పోతున్నరు, ఏ పిల్లోడు బడి ఎగ్గొట్టి తిరుగుతున్నడు, అన్నీ ఆయన కండ్ల ముందే. అరుగు మీద కూర్చున్న ముసలమ్మ కొత్త కోడలికి తల్లి. అత్తగారింట్ల చెప్పుకోలేని బాధ ఆమె దగ్గర చెప్పుకునేది ఆ పిల్ల. అరుగు పోయినంక ఆ కాపల పోయింది. ఆ ఓదార్పు పోయింది.
అభివృద్ధి వద్దనడం లేదు. కొత్త ఇండ్లు రావాలె, రోడ్లు రావాలె, ఫోన్లు ఉండాలె. కానీ ఇల్లు కట్టుకునేటప్పుడు ఒక్క ముచ్చట ఆలోచించండి. గోడ ఎంత ఎత్తు కట్టినమో కాదు, మన గేటు దగ్గర ఇంకో మనిషి కూర్చోడానికి చోటుందా అని. సాయంత్రం ఒక్క అరగంట ఫోన్ లోపల పెట్టి, ఇంటి ముందు కుర్చీ వేసుకొని కూర్చోండి. పక్కింటాయనను పిలవండి. ఏం ముచ్చట లేకున్నా సరే. ఏ పని లేకుండ ఇద్దరు మనుషులు పక్కపక్కన కూర్చోవడమే ఈ కాలంల పెద్ద సంపద.
ఊరు చచ్చిపోయేది కరువుతోనో, వలసతోనో మొదలు కాదు. అరుగులు ఖాళీ అయిన రోజే మొదలైతది







