సంఘటిత ఉద్యమాలతోనే కార్మికుల హక్కుల సాధన
– కెహెచ్‌పిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలో వక్తలు
హైదరాబాద్, అక్టోబర్ 17, అద్దం న్యూస్ : సంఘటిత ఉద్యమాలతోనే కార్మికుల హక్కుల సాధన సాధ్యమవుతుందని పలువురు వక్తలు అన్నారు. కార్మిక హక్కుల పోరాట సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రథమ మహాసభలు శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగాయి. కెహెచ్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురుగు ప్రభాకర్, కార్యదర్శి కల్లెం చంద్రశేఖర ప్రసాద్ అధ్యక్షతన జరగగా ప్రధాన వక్తగా హాజరైన రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ హాజరై మాట్లాడుతూ… శ్రామికుల శ్రమతోనే దేశంలో సంపద ఏర్పడుతుంది.అలాంటి శ్రామికులను భూస్వాములు, పెట్టుబడిదారులు దోపిడీ చేస్తున్నారన్నారు. సమస్త సంపద కార్మికుల శ్రమతో తయారవుతున్నప్పటీకీ సంపదపై హక్కు ఎందుకు శ్రామికులకు లేదన్నారు. దేశంలో , రాష్ట్రంలో కొన్ని ట్రేడ్ యూనియన్లు శ్రమదోపిడి గురించి కార్మికులకు సోషలిస్టు అవగాహన చెప్పకుండా కేవలం ఆర్థిక డిమాండ్లకే పరిమితమవుతున్నాయన్నారు. కార్మిక హక్కుల పోరాట సంఘం పోరాట పటిమతో శ్రమదోపిడిని నిలువరించాలన్నారు. తెలంగాణలో భూస్వాముల వ్యాపారస్తులుగా అవతారమెత్తి ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారని విమర్శించారు. అతి తక్కువ వేతనాలు ఇస్తూ పేదలను మోసం చేస్తున్నారని, కార్మిక సంఘాలు ప్రభుత్వ ఉద్యోగాల కోసం వారి భద్రత కోసం పనిచేయడమే కాదు అట్టడుగు వర్గాల శ్రామికుల కోసం కార్యక్రమం రూపొందించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ సర్కారు మన దేశం అభివృద్ధి చెందిందని చెప్తుండగా దేశం ఆకలి సూచిలో 105 వ స్థానంలో ఉందన్నారు. దేశంలో ఆదాని, అంబానీ కుటుంబాలు అభివృద్ధి అయితే దేశం అభివృద్ధి చెందినట్లు కాదు, 375 కుటుంబాల వద్ద దేశ సంపద 90 శాతం పోగు అయిందని.. ఇదేనా అభివృద్ధి ? అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులపై తీవ్రమైన నేరారోపణలు, క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వారి ఆస్తులు పైపైకి పెరిగితే పేదలకు తినడానికి తిండి కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు. దేశ పాలకుల వద్ద పేదరికం, నిరుద్యోగం, ఆకలి పారదోలడానికి ఎలాంటి ప్రణాలికలు లేవు.. కులం. మతం జాతి పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు.
సీనియర్ జర్నలిస్టు కాకర్ల సజయ మాట్లాడుతూ… అసంఘటిత రంగ శ్రామికులను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి లేబర్ కార్డులు మంజూరు చేయాలన్నారు. వారిని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వైద్య సదుపాయాలు, విద్య, బీమా పథకాలు వర్తింప చేయాలన్నారు. మరోవైపు అన్ని రంగాల్లో మహిళలు శ్రమదోపిడికీ గురౌతున్నారని తెలిపారు. పని ప్రదేశాలలో స్త్రీలు లైంగిక అత్యాచారాలు, దాడులకు గురవుతున్నారన్నారు. అసంఘటిత రంగంలోని ఇళ్ళలో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్ సంఘటిత ఉద్యమాలతో “గృహ కార్మికుల ” గుర్తింపు పొందినప్పటికీ హక్కుల సాధన మాత్రం సంఘటిత ఉద్యమాలతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గిగ్ వర్కర్స్, డొమెస్టిక్ వర్కర్స్, సినిమా కార్మికులు మరింత సంఘటితంగా పోరాడాలని.. అందుకు కార్మికుల హక్కుల పోరాట సంఘం ముందు వరుసలో ఉండాలన్నారు. ఈ సభలో సంస్కృతిక కార్యక్రమాలు కార్మికులకు నూతనోతేజాన్నీ ఇచ్చాయి. శ్రామిక మార్గం ఎడిటర్ మోహన్ బైరాగి, సినిమా కార్మికులు వేదిక అధ్యక్షుడు లారా, మంచాల వెంకటస్వామి, జి.నాగయ్య, ఎనుముల యాదగిరి ప్రసంగించగా పత్తిపాటి లక్ష్మి కాంతమ్మ, కాపల్లి, సుచరిత, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply