హైదరాబాద్, అక్టోబర్ 25, ( అద్దం న్యూస్ ) : బీసీ, ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో పదేళ్ల నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న 8 వేల మంది తాత్కాలిక ఉపాధ్యాయులను వెంటనే పర్మినెంట్ చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్‌లో రాష్ట్ర తాత్కాలిక ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… గురుకుల ఉపాధ్యాయులకు విద్యార్హతలు, బోధనా అనుభవం, ఉత్తమ ఫలితాలు ఉన్నప్పటికీ ఏళ్ల తరబడి తాత్కాలిక ఉద్యోగులుగానే కొనసాగించడం అన్యాయమని అన్నారు. బీసీ గురుకుల పాఠశాలల్లో పదో తరగతిలో 99 శాతం, ఇంటర్మీడియట్‌లో 98.5 శాతం ఉత్తీర్ణత సాధించడంలో తాత్కాలిక ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. డిగ్రీ, పీజీ, బీఈడీ, టెట్ అర్హతలతో పాటు పదేళ్ల నుంచి 20 ఏళ్ల బోధనా అనుభవం ఉన్నవారి సేవలను గుర్తించి క్రమబద్ధీకరించాలని కోరారు. నోటిఫికేషన్ల ద్వారా మెరిట్ కమ్ రోస్టర్ విధానంలో ఎంపికైన ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేస్తున్నారని తెలిపారు. దీర్ఘకాలంగా అదే ఉద్యోగంలో కొనసాగడంతో ఇతర ఉద్యోగాలకు ప్రయత్నించే అవకాశం కోల్పోయారని, ప్రస్తుతం వయోపరిమితి దాటిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, వేతనాలు పెరగకపోవడంతో కుటుంబ పోషణ, పిల్లల చదువుల ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించడం భారంగా మారిందన్నారు. గతంలో రాష్ట్రంలో కాంట్రాక్టు, డైలీవేజ్ ఉద్యోగులను క్రమబద్ధీకరించిన తరహాలో మిగిలిన తాత్కాలిక ఉద్యోగులను కూడా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం అంశాలపై న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను అమలు చేయాలని కోరారు. తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో తీసుకున్న చర్యలను తెలంగాణలోనూ అమలు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చొరవ తీసుకొని తాత్కాలిక ఉద్యోగుల క్రమబద్ధీకరణపై విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్ నీలా వెంకటేష్, బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ సి.రాజేందర్, బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు అనంతయ్య, అల్లం యాదయ్య, రామానుంజనేయులు, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.






