బషీర్‌బాగ్, అక్టోబర్ 2, ( అద్దం న్యూస్ ) : బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిని మార్చుకోవాలని, లేనిపక్షంలో బీసీలే తగిన గుణపాఠం చెబుతారని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీలకు విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటా కల్పించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం సాయంత్రం బీసీ సంఘాల ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ… ఇటీవల రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని, బీసీలకు ఒక్క స్థానం కూడా ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. వెంటనే నిర్ణయాన్ని పునఃపరిశీలించి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని బీసీలకు కేటాయించాలని కోరారు. ఇటీవల నియమించిన ఆరుగురు సమాచార కమిషనర్లలో ఒక్కరికి కూడా బీసీలకు అవకాశం కల్పించలేదని విమర్శించారు.
నామినేటెడ్ పదవుల్లో 56 శాతం జనాభా ఉన్న బీసీలకు కేవలం 15 శాతం వాటా కల్పించడం సరికాదన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతం నుంచి 17 శాతానికి తగ్గించారని ఆరోపించారు. గత మూడేళ్లుగా బీసీ విద్యార్థులు అనేక ఉద్యమాలు చేస్తున్నప్పటికీ 14 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు సకాలంలో అందడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారుల నియామకాల్లోనూ బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మంత్రివర్గంలో బీసీలకు ఇద్దరికే ప్రాతినిధ్యం కల్పించి, ప్రాధాన్యత లేని శాఖలు కేటాయించారని అన్నారు. జనాభా ప్రకారం కనీసం ఎనిమిది మంత్రి పదవులు బీసీలకు దక్కాలని, కీలక శాఖలు అప్పగించాలని డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ శాఖలోని కీలక పోస్టులతో పాటు బీసీ కమిషన్లోనూ బీసీలకు తగిన ప్రాతినిధ్యం ఉండాలని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బీసీల కోసం కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదని, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, కొత్త హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా బీసీ వ్యతిరేక వైఖరిని మార్చుకుని బీసీల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడు సి.రాజేందర్, బీసీ ఉద్యోగుల సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లం యాదయ్య, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పర్లగోర్ల మోడీ రాందేవ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ నిఖిల్ పటేల్, రాష్ట్ర బీసీ ఉద్యోగ సంఘం నాయకులు రామాంజనేయులు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.






