హైదరాబాద్, మే 28, అద్దం న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు పెద్ద మొత్తంలో ఫీజులు పెంచుకునేందుకు తెలంగాణ అడ్మిషన్ & ఫీ రెగ్యులేషన్ కమిటీ ( టిఎఎఫ్‌ఆర్‌సి ) కి పంపిన ప్రతిపాదనలు ఆధారంగా ఫీజులు పెంచే ప్రతిపాదనలను తక్షణమే విరమించుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాక్య ( డివైఎఫ్‌ఐ ) ఆధ్వర్యంలో ఉన్నత విద్య మండలి చైర్మన్, ప్రొఫెసర్ వి.బాలకృష్ణ రెడ్డి, వైస్ చైర్మన్, ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం లకు వినతి పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ లు మాట్లాడుతూ… రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యా వ్యాపారమే ప్రధాన లక్ష్యంగా నడుస్తున్నాయన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రతి ఏటా లక్షల్లో ఫీజులు పెంచుతూ పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులపై లక్షలాది రూపాయల ఫీజుల భారం మోపుతున్న పరిస్థితి ఉందన్నారు.
ప్రతి ఏటా కళాశాల యాజమాన్యాలు తప్పుడు ఆడిట్ నివేదికలు, ఆదాయ, వ్యయాలు సృష్టించి ప్రభుత్వాన్ని మరియు టిఎఎఫ్‌ఆర్‌సిని మోసం చేస్తున్నాయన్నారు. తద్వారా ఇష్టానురీతిన పేరు ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు అన్నీ కూడా ప్రతి ఏటా ఖర్చులు పెరిగాయన్న సాకుతో ఫీజులు పెంచుకొని వందల కోట్ల రూపాయల విద్యా వ్యాపారానికి పాల్పడుతున్నాయని అన్నారు. ఆ కళాశాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇటీవల ఉన్నత విద్యామండలి ఇంజనీరింగ్ కళాశాలలపై చేపట్టిన తనిఖీల రిపోర్టును బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫీజులను నిర్ణయించే అధికారం ప్రభుత్వమే తీసుకోవాలన్నారు. ఫీజులు పెంచడం మూలంగా అటు ప్రభుత్వానికి, ఇటు విద్యార్థులకు తీవ్ర భారం ఇప్పటికే పెరిగిన ఫీజులు చెల్లించలేక, యాజమాన్యాల వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. అనేక సందర్భాల్లో సర్టిఫికెట్లు ఇచ్చే సమయంలోను తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాలకు అనుకూలంగా లక్షల రూపాయల్లో ఫీజులు పెంచుకునే అవకాశం ఇవ్వడం వందల కోట్ల విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహించినట్లే అవుతుందన్నారు. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యాల విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని, విద్యార్థులపై ఫీజుల భారం మోపకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వినతి పత్రాన్ని అందచేసిన వారిలో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండి.జావిద్, నాయకులు రాజు తదితరులున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply