కమీషనర్ ఛాంబర్ ముందు బైఠాయింపు
ఆందోళనలో పాల్గొన్న టీడబ్ల్యూజేఎఫ్ నేతలు
సమస్యను వెంటనే పరిష్కరించాలి
– టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య డిమాండ్
హైదరాబాద్, నవంబర్ 2, ( అద్దం న్యూస్ ) : కేబుల్ టీవీ న్యూస్ ఛానళ్ళ పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న అణిచివేత వైఖరికి నిరసనగా అనేక మంది కేబుల్ చానళ్ళ జర్నలిస్టులు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార భవన్ ( ఐఅండ్ పీఆర్ కమీషనర్ కార్యాలయం ) ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తెలంగాణ కేబుల్ చానల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన జర్నలిస్టులు ఐఅండ్ పీఆర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. కమీషనర్ రావాలని పట్టుపట్టిన కేబుల్ చానళ్ళ నిర్వహకులు, జర్నలిస్టులు ఒక్కసారిగా పోలీసుల వలయాన్ని చేదించుకొని కార్యాలయంలోకి దూసుకెళ్ళారు. కమీషనర్ చాంబర్ ముందు బైఠాయించి నినాదాలు చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు బలవంతంగా బయటకు తరలించారు. అంతకుముందు ధర్నాలో పాల్గొన్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టీడబ్ల్యూజేఎఫ్ ) రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో అనేక ఏశ్ళుగా నడుస్తున్న కేబుల్ చానళ్ళకు ఐపీ చానళ్ళ పేరుతో అక్రెడిటేషన్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. చిన్న పత్రికలను, కేబుల్ చానళ్ళ సంఖ్యను కుదించాలనే కుట్రలో భాగంగానే ఇటీవల ఇంటర్నెట్ ప్రోటోకాల్ ( ఐపీ ) నెట్వర్క్ ద్వారా నడుస్తున్నాయనే సాకుతో అనేక కేబుల్ చానళ్ళకు, వాటిలో పని చేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా అన్యాయం చేశారని అన్నారు. అక్రెడిటేషన్ కార్డుల జారీలో అనేక అవకతవకలు జరిగాయని, లక్షల రూపాయల పెట్టుబడితో నడుపుతున్న అసలైన కేబుల్ చానళ్ళకు అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారని వారు ఆరోపించారు. కేబుల్ చానళ్ళకు గతంలో జిల్లాకు నాలుగు కార్డులు, రాష్ట్ర స్థాయిలో 12 కార్డులు ఉండగా వీటిని సగానికి తగ్గించారని అన్నారు.
కేబుల్ చానళ్ళకు ఒకవైపు ప్రభుత్వం నుంచి ఎటువంటి అడ్వర్టయిజ్మెంట్లు, ఇతర సబ్సిడీలు గానీ లేకపోవడం, మరోవైపు కనీసం అక్రెడిటేషన్ కార్డులు కూడా లేకపోవడం వల్ల అనేక చానళ్ళు మూతపడే పరిస్థితి నెలకొందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ ప్రభుత్వం జర్నలిస్టులకు 44 వేలకు పైగా అక్రెడిటేషన్లు ఇస్తుందని చెప్పిన మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి…ఇప్పటి వరకు ఎన్ని అక్రెడిటేషన్లు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, కేబుల్ చానళ్ళకు ఎన్ని ఇచ్చారో వెల్లడించాలని అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం లో చిన్న పత్రికలు, కేబుల్ ఛానళ్ళ పట్ల ప్రభుత్వాలు చిన్నచూపు చూడడం సరైంది కాదని, ఐపీ ఛానళ్ళ పేరుతో కేబుల్ చానళ్ళను మూసివేయాలనే ఆలోచనను ప్రభుత్వం విరమించుకొని అన్ని కేబుల్ చానళ్ళకు వెంటనే అక్రెడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు శ్రీనివాస్, యర్రమిల్లి రామారావు, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, టీడబ్ల్యూజేఎఫ్ హైదరాబాద్ జిల్లా కన్వీనర్ వి.రవికుమార్, కో-కన్వీనర్ ఎం.రవికుమార్, గద్వాల జిల్లా అధ్యక్షుడు గిరిబాబు, కేబుల్ చానళ్ళ జేఏసీ నాయకులు పాల్గొన్నారు.






