తొలి విడతలో 11 ఎస్‌టిపిల నుంచి 21 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా
# నగర వ్యాప్తంగా సేవల విస్తరణకు ప్రత్యేక ఏర్పాట్లు
# గ్రీన్ వాటర్ సరఫరాకు 100 ప్రైవేట్ ట్యాంకర్ల నమోదు
# ప్రభుత్వ శాఖలు, పార్కులు, గ్రీనరీ అవసరాలకు తొలి ప్రాధాన్యం
# ఎస్‌టిపిల వారీగా ప్రత్యేక అధికారుల నియామకం
# తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించడమే లక్ష్యం – జలమండలి ఎండీ అశోక్ రెడ్డి
హైదరాబాద్ బ్యూరో, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరంలో నేటి నుంచి గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలు ప్రారంభం కానున్నాయి. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని తాగేతర అవసరాలకు వినియోగించేందుకు జలమండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తొలివిడతలో నగరంలోని 11 ఎస్‌టిపిల నుంచి 21 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ద్వారా సేవలను ప్రారంభించనుంది. అనంతరం అన్ని డివిజన్ల పరిధిలో ఈ సేవలను విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. రాబోయే ఎల్-నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించడం, శుద్ధి చేసిన నీటి పునర్వినియోగాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ శాఖలు, పార్కులు, గ్రీనరీ నిర్వహణకు తొలి ప్రాధాన్యం ఇస్తూ నిర్మాణ రంగం, పరిశ్రమలు, ఇతర తాగేతర అవసరాలకు గ్రీన్ వాటర్ సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు.
11 ఎస్‌టిపిల్లో సేవలు ప్రారంభం :
నేడు ( నవంబర్ ) 1న అత్తాపూర్‌లో 5, అంబర్‌పేట్‌లో 3, మీరాలంలో 2, నాగోల్‌లో 2, ముల్కత్వ చెరువు వద్ద 2, కోకాపేట్‌లో 1, గోపన్‌పల్లిలో 1, లింగంకుంటలో 1, నల్లచెరువు వద్ద 2 హుస్సేన్ సాగర్ ఎస్టీపీ వద్ద 2, సరూర్ నగర్ చొప్పున మొత్తం 21 గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను ప్రారంభించనున్నారు.
100 ప్రైవేట్ ట్యాంకర్ల నమోదు :
గ్రీన్ వాటర్ సరఫరా కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు ఇప్పటివరకు సుమారు 100 ప్రైవేట్ వాటర్ ట్యాంకర్లు జలమండలి వద్ద నమోదు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వీటి ద్వారా శుద్ధి చేసిన నీటి సరఫరాను దశలవారీగా విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ :
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణ కోసం ఎస్టీపీల వారీగా ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు ఫిల్లింగ్ పాయింట్ల నిర్వహణ, ట్యాంకర్ల కేటాయింపు, నీటి నాణ్యత, సరఫరా కార్యకలాపాలను పర్యవేక్షించనున్నారు. గ్రీన్ వాటర్ సరఫరా చేసే ప్రతి ట్యాంకర్ తప్పనిసరిగా ఆకుపచ్చ రంగులో ఉండాలని, జలమండలి నిర్దేశించిన నమూనా ప్రకారం ప్రత్యేక బ్రాండింగ్ చేయాలని ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు. ప్రతి ట్యాంకర్‌పై ‘ STP TREATED WATER – NOT FOR DRINKING ’ అనే హెచ్చరికను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు.
నీటి పొదుపునకు ప్రాధాన్యం :
తాగునీటిని తాగడానికి, గృహ అవసరాలకు మాత్రమే వినియోగించి, నిర్మాణ పనులు, పార్కుల నిర్వహణ, మొక్కల పెంపకం, ఇతర తాగేతర అవసరాలకు ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించాలని జలమండలి విజ్ఞప్తి చేసింది. గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సేవలను సద్వినియోగం చేసుకుని నీటి సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరింది.






