హైదరాబాద్, అక్టోబర్ 30, ( అద్దం న్యూస్ ) : ఈ నెల 26 నుంచి నవంబర్ 1 వరకు ” సమృద్ధికి సత్ప్రవర్తన ( Probity for Prosperity ) ” అనే థీమ్ నిర్వహిస్తున్న విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా, జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు ( నాబార్డ్ ) తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లో వాకథాన్ జరిగింది. ఈ వాకథాన్‌లో నాబార్డ్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, నిజాయితీ, పారదర్శకత, అవినీతి రహిత సమాజ నిర్మాణంలో సమష్టి బాధ్యత వంటి సందేశాలను చాటిచెప్పే ప్లకార్డులను ప్రదర్శించారు. ఈ వాకథాన్ నాబార్డ్ ప్రాంతీయ కార్యాలయం చేపట్టిన విస్తృత విజిలెన్స్ అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా సిబ్బందితో నిజాయితీ ప్రతిజ్ఞ చేయించడం, ఉద్యోగులు, ఇతర భాగస్వాములు ఆన్‌లైన్ ద్వారా ఇ-నిజాయితీ ప్రతిజ్ఞ చేయడానికి ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. రోజువారీ జీవితంలో విజిలెన్స్, నిజాయితీ ప్రాముఖ్యతపై అవగాహన పెంపొందించేందుకు ఉద్యోగుల కోసం క్విజ్, స్లోగాన్ రైటింగ్ తదితర పోటీలను నిర్వహించారు.
అంతే కాకుండా, గ్రామీణ ప్రజల్లో నిజాయితీ, పారదర్శకత పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లా స్థాయిలో అవగాహన గ్రామసభలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా నాబార్డ్ నైతిక ప్రవర్తన, అవినీతిని నిరోధించే విజిలెన్స్ చర్యలు, పారదర్శకమైన సంస్థాగత విధానాల పట్ల తన నిబద్ధతను పునరుద్ఘాటిస్తోంది. బలమైన సంస్థల నిర్మాణానికి, సమృద్ధివంతమైన దేశాభివృద్ధికి నిజాయితీ, సత్ప్రవర్తనలను ఉమ్మడి విలువలుగా స్వీకరించాలని ఉద్యోగులు, భాగస్వాములు, ప్రజలకు పిలుపునిచ్చారు.






