...

బీఆర్ఎస్ ప్రభుత్వ పాపంలో నాకు భాగం ఉంది.. న్యాయం చేయలేకపోయా క్షమించండి – తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

బీఆర్ఎస్ ప్రభుత్వ పాపంలో నాకు భాగం ఉంది.. న్యాయం చేయలేకపోయా క్షమించండి
జాగృతి అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థే ఉండదు
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

తెలంగాణ బ్యూరో, మార్చి 29, అద్దం న్యూస్ :   ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ పాపంలో నాకు భాగం ఉందనే.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా క్షమించాలని కోరుతున్నాన‌ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. జాగృతి అధికారంలోకి వస్తే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థే ఉండదన్నారు. హైద‌రాబాద్ ఇందిరాపార్క్ ధ‌ర్నాచౌక్‌లో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ధర్నాకు హాజ‌రై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మ‌ద్ద‌తునిచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… ఏజెన్సీలకు ఈ ప్రభుత్వం కొమ్ము కాస్తు…5 లక్షల మందికి అన్యాయం చేస్తోందన్నారు. హైదరాబాద్ వీధుల్లో 5 లక్షల మంది ఉద్యోగులు మార్చ్ చేస్తే వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు మీకు జాగృతి తోడుగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. కోదండరాం, హరగోపాల్ లాంటి మేధావుల మౌనం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారిందని విమ‌ర్శించారు. మన రాష్ట్రంలో 5 లక్షల మంది అన్నదమ్ములు, అక్కా చెల్లెలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇక అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవని అనుకున్నాం విచిత్రంగా అప్పుడున్న పర్మినెంట్ ఉద్యోగులే కొన్ని డిపార్ట్‌మెంట్ల‌ల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులు అయ్యారన్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను చాలా వరకు గతంలో కంటిన్యూ చేశారు. కానీ తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బంది పడ్డారని తెలిపారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో జరిగిన వ్యవహారమే అందుకు ఉదాహరణ అని క‌విత అన్నారు. విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఆటిజన్లను మార్చే ప్రయత్నం మేము చేశాం కొన్ని చేయగలిగాం, మరికొన్ని మాత్రం ఏమీ మారలేదన్నారు. గత ప్రభుత్వంలో నేను కూడా భాగం.. ఆనాటి పాపంలో నాకు భాగం ఉందన్నారు. అప్పుడు మీ జీవితాల్లో మార్పు తేలేనందుకు మీ చెల్లిగా మీ అందరినీ క్షమాపణ కోరుతున్నాన‌ని క‌విత తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను పట్టించుకోవటం లేదని కాంగ్రెస్‌ను గెలిపించారని…రేవంత్ రెడ్డి ఉద్యమంలో లేకపోయిన సరే కోదండం రాం, హరగోపాల్ లు చెప్పారని కాంగ్రెస్‌కు ప్ర‌జ‌లు మద్దతిచ్చారన్నారు.

గత ప్రభుత్వంలో ధర్నా చౌక్ ను తీసేసి ప్రజాస్వామ్య హక్కు లేకుండా చేశారన్నారు. రేవంత్ రెడ్డి, కోదండ రాం, హరగోపాల్ లాంటి వాళ్లు మాత్రం ధర్నాచౌక్ కొనసాగిస్తామని చెప్పారు.. కానీ ధర్నా చౌక్ వద్ద ఎన్ని రోజులు ధర్నా చేసిన మీ చావు మీరు చావండన్నట్లుగా ఈ ప్రభుత్వ వైఖరి ఉందని విమ‌ర్శించారు. రెండేళ్లుగా మీరు చేస్తున్న పోరాటం చూస్తూనే ఉన్నామ‌న్నారు. మిలియన్ మార్చ్ లాంటి పోరాటం ద్వారా మనం తెలంగాణ సాధించుకున్నాం.. ఇప్పుడు మీ 5 లక్షల మంది హాఫ్ మిలియన్ ఉద్యోగులు హైదరాబాద్ వీధుల్లో మార్చ్ చేస్తే వెంటనే కార్పొరేషన్ వస్తుందన్నారు. ఏజెన్సీలకు జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించారు.. కానీ ఆ ప్రయోజనాన్ని ఉద్యోగులకు రాకుండా చేస్తున్నారు.. అంటే ఎంత నిర్లక్ష్యం ? రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

          మేము త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించబోతున్నామ‌ని… అసలు ప్రభుత్వంలో అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల ఉండవద్దన్నదే మా విధానమ‌న్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫలాలు ప్రజలకు చేరేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఉండాలన్నదే మా పాలసీ క‌విత తెలిపారు. మేము రాజకీయ పార్టీగా అవతరించే లోపే మీ సమస్య పరిష్కారమవుతుందని భావిస్తున్నామ‌ని అన్నారు. ఈ ప్రభుత్వానికి మేము రెండు రోజులు సమయం ఇస్తున్నామ‌ని.. ఈ లోపు ప్రతి డిపార్ట్‌మెంట్‌కు సంబంధించి ఉద్యోగ భద్రతపై జీవోలు రావాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కార్పొరేషన్‌ను కూడా వెంటనే ఏర్పాటు చేయాలని, మధ్యలో ఏజెన్సీలు ఉండకూడదని.. మేము అధికారంలోకి వస్తే పర్మినెంట్‌గా కార్పొరేషన్ ద్వారా జీతాలు ఇస్తామ‌ని క‌విత హామినిచ్చారు. తెలుగు దేశం ప్రభుత్వం తెచ్చిన ఈ విధానంపై మనం అప్పట్లో జోకులు వేసుకున్నాం.. ఇప్పటికీ కూడా అదే విధానం కొనసాగటం బాధాకరమ‌న్నారు. ఈ విషయంలో కోదండం రాం, హరగోపాల్ మాట్లాడాలని… మేధావుల మౌనం… అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారిందన్నారు. వెంటనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధ‌ర్నాలో ధ‌ర్మ స‌మాజ్ పార్టీ అధ్య‌క్షుడు విశార‌ద‌న్, అవుట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ఉద్యోగ‌స్తులు త‌దిత‌రులు పాల్గొన్నారు.


https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.