Tuesday, November 17, 2026
No menu items!
Homedevotionalఎన్‌టిఆర్ స్టేడియంలో ప్రారంభ‌మైన కోటి దీపోత్స‌వం – వైభ‌వంగా కాళేశ్వరం శ్రీముక్తేశ్వరస్వామి కల్యాణోత్సవం

ఎన్‌టిఆర్ స్టేడియంలో ప్రారంభ‌మైన కోటి దీపోత్స‌వం – వైభ‌వంగా కాళేశ్వరం శ్రీముక్తేశ్వరస్వామి కల్యాణోత్సవం

📰 Generate e-Paper Clip

హైద‌రాబాద్‌, న‌వంబ‌ర్ 14, ( అద్దం న్యూస్ ) :     కార్తీకమాసం పుర‌స్క‌రించుకుని భ‌క్తి టీవి ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏడాది నిర్వ‌హించే కోటి దీపోత్స‌వం శ‌నివారం హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఎన్‌టిఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమైంది. తొలిరోజు వేడుకలు శంఖారావం, వేదపఠనంతో భక్తి పూర్వకంగా ఆరంభమయ్యాయి. ప్రాంగణంలోని మహాశివలింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించగా.. భక్తిగీతాలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కోటి మల్లెల ప్రాంగణంలో భక్తులచే కోటి మల్లెల అర్చన, 108 శంభాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం కాళేశ్వరం శ్రీముక్తేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. పుష్పగిరి మహాసంస్థానం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విద్యా శంకరభారతి స్వామి కార్యక్రమానికి విచ్చేసి అనుగ్రహభాషణం చేశారు. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నంద ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాంగణంలోని బంగారు శివలింగం వద్ద 108 మందితో పంచహారతులు నిర్వహించారు.  హంసవాహనంపై కాళేశ్వరం ఉత్సవమూర్తుల ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. పీఠాధిపతి, ముఖ్య అతిథులు ఆధ్వర్యంలో కార్తీక దీపారాధన నిర్వహించగా.. భక్తులు సామూహికంగా దీపాలు వెలిగించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. సప్తహారతి, మహానీరాజనం, గురువందనం కార్యక్రమాలు జరిగాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

 

 

సుందరీ రవిచంద్ర బృందం భరతనాట్యం, మాధవీశర్మ బృందం నాగిని నృత్యం, వేద భార్గవి బృందం జానపద నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. పంబమేళా విన్యాసాలు, కోలాట కదంబం భక్తులను ఆకట్టుకున్నాయి. మహామంగళహారతితో తొలిరోజు కోటి దీపోత్సవ కార్యక్రమాలు ముగిశాయి. భక్తి, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవం కలగలిసిన ఈ వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page