ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా 150 మందికి పైగా ఉచిత వైద్య పరీక్షలు
– సికింద్రాబాద్‌లో అవగాహన నడక, ఆరోగ్య సదస్సు నిర్వహణ
పద్మారావునగర్, నవంబర్ 14, ( అద్దం న్యూస్ ) : మధుమేహం నియంత్రణలో లేకపోతే గుండె, మూత్రపిండాలు, కళ్లు, నరాలు దెబ్బతినే ప్రమాదం ఉందని కేర్ హాస్పిటల్స్ వైద్యులు హెచ్చరించారు. ముఖ్యంగా ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే శరీరంలోని కీలక అవయవాలపై మధుమేహం ప్రభావం చూపుతుందని తెలిపారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేర్ హాస్పిటల్స్, ముషీరాబాద్ ఆధ్వర్యంలో శనివారం సికింద్రాబాద్‌లోని పద్మారావునగర్ పార్కులో ఉచిత వైద్య శిబిరం, అవగాహన నడక, ఆరోగ్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా 150 మందికి పైగా వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు, వృద్ధులు, ఉదయం నడకకు వచ్చే వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. మధుమేహ నివారణ, నియంత్రణలో రోజువారీ వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాధాన్యాన్ని వివరిస్తూ అవగాహన నడక చేపట్టారు. అనంతరం నిర్వహించిన ఆరోగ్య సదస్సులో మధుమేహం ప్రారంభ లక్షణాలు, దీర్ఘకాలిక సమస్యలు, ముందస్తు వైద్య పరీక్షల ఆవశ్యకతపై వైద్యులు అవగాహన కల్పించారు. కేర్ హాస్పిటల్స్‌కు చెందిన జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్లు డాక్టర్ మొయినుద్దీన్, డాక్టర్ ఇమ్రాన్ ఖాన్, డాక్టర్ భానుప్రియతో పాటు ఎండోక్రైనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ కందుల శ్రీనివాస్ వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రజలకు ఆరోగ్య సలహాలు అందించారు. రక్తంలో చక్కెర స్థాయుల నియంత్రణ, ఆహారపు అలవాట్లు, వ్యాయామం, ముందస్తు జాగ్రత్తలపై సూచనలు చేశారు. అధిక దాహం, తరచూ మూత్రవిసర్జన, కారణం లేకుండా బరువు తగ్గడం, నిరంతర అలసట, చూపు మందగించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు సూచించారు. మధుమేహం కారణంగా నరాలు దెబ్బతినడం, కాళ్లకు రక్తప్రసరణ తగ్గడం వల్ల చిన్న గాయాలు కూడా త్వరగా మానకుండా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చని హెచ్చరించారు. సమతుల ఆహారం తీసుకోవడం, రోజూ వ్యాయామం చేయడం, పొగాకు వినియోగానికి దూరంగా ఉండటం, ఒత్తిడిని తగ్గించుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరమని తెలిపారు.

లక్షణాలు లేకున్నా ముప్పు తప్పదు : డాక్టర్ మొయినుద్దీన్
కేర్ హాస్పిటల్స్ జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ మొయినుద్దీన్ మాట్లాడుతూ… మధుమేహం ఉన్న చాలామందికి ప్రారంభంలో ఎలాంటి లక్షణాలు కనిపించవన్నారు. రక్తంలో చక్కెర స్థాయులు అధికంగా ఉన్నప్పటికీ ఆరోగ్యంగానే ఉన్నామని భావిస్తుంటారు.. కానీ దీర్ఘకాలం మధుమేహం నియంత్రణలో లేకపోతే గుండెపోటు, పక్షవాతం, మూత్రపిండాల వ్యాధులు వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చన్నారు. కుటుంబంలో మధుమేహ చరిత్ర ఉన్నవారు, అధిక బరువు, రక్తపోటు సమస్యలతో బాధపడేవారు, శారీరక శ్రమ తక్కువగా చేసేవారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. లక్షణాలు కనిపించే వరకు వేచి చూడకూడదన్నారు.
చక్కెర నియంత్రణతోనే సరిపోదు : డాక్టర్ కందుల శ్రీనివాస్
ఎండోక్రైనాలజీ కన్సల్టెంట్ డాక్టర్ కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ… మధుమేహం అంటే కేవలం రక్తంలో చక్కెర స్థాయులు పెరగడం మాత్రమే కాదు.. ఇది శరీరంలోని దాదాపు అన్ని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపుతుందన్నారు. ఎక్కువకాలం చక్కెర స్థాయులు అదుపులో లేకపోతే మూత్రపిండాల పనితీరు దెబ్బతినడం, చూపు మందగించడం, నరాలు దెబ్బతినడం, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. అందుకే చక్కెర స్థాయులతో పాటు రక్తపోటు, కొలెస్ట్రాల్, మూత్రపిండాల పనితీరు, కంటి ఆరోగ్యాన్ని కూడా క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలన్నారు. వ్యాధిని ముందుగానే గుర్తించి సరైన చికిత్స తీసుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా అనేక సమస్యలను నివారించవచ్చు లేదా ఆలస్యం చేయవచ్చని వివరించారు.
ముందస్తు పరీక్షలపై అవగాహన పెంచడమే లక్ష్యం : డాక్టర్ భారతి జెట్టి
ముషీరాబాద్ కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ భారతి జెట్టి మాట్లాడుతూ… చాలామంది ఆరోగ్య సమస్యలు తీవ్రమైన తర్వాతే వైద్యులను సంప్రదిస్తున్నారన్నారు. అలా కాకుండా ముందుగానే పరీక్షలు చేయించుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.150 మందికి పైగా పాల్గొనడం సంతోషకరమన్నారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించేలా ప్రోత్సహించడం మా లక్ష్యం అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్తామని తెలిపారు. మధుమేహంపై అవగాహన పెంచడం, ముందస్తు వైద్య పరీక్షలను ప్రోత్సహించడం, ప్రజలకు నివారణ ఆరోగ్య సేవలను చేరువ చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కేర్ హాస్పిటల్స్ ప్రతినిధులు తెలిపారు.








