Tuesday, November 17, 2026
No menu items!
HomeGREATER HYDERABAD15 రోజుల ఖర్చుతో నెల రోజుల ప్రయాణం -మహిళలకు భారీ డిస్కౌంట్

15 రోజుల ఖర్చుతో నెల రోజుల ప్రయాణం -మహిళలకు భారీ డిస్కౌంట్

📰 Generate e-Paper Clip

ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ బంపర్ ఆఫర్
– బస్ పాస్‌ వినియోగదారులకు 9 రకాల భారీ రాయితీలు
 మంత్లీ సీజన్ టికెట్స్ ( ఎంఎస్‌టీ ) పై వరాల జల్లు : ఆదివారం ఫ్రీ జర్నీ
 బస్ పాస్ దూర పరిమితి ఎత్తివేత, రూ. 20తోనే అప్‌గ్రేడ్ : ప్రయాణం ఇక మరింత పొదుపు

తెలంగాణ బ్యూరో, ( అద్దం న్యూస్ ) :   రోజువారీ బస్సు ప్రయాణాన్ని మరింత పొదుపుగా…సులభంగా, సౌకర్యవంతంగా మార్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీజీఎస్ ఆర్టీసీ ) ప్రయాణికులకు భారీ శుభవార్త అందించింది. సంస్థ తమ నెలవారీ సీజన్ టికెట్ (MST) పథకం కింద 09 అదనపు సౌకర్యాలు, ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. ఈ సవరించిన నిబంధనలు శనివారం ( నేటి ) నుంచి నుండి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, నిత్య ప్రయాణికులకు ఈ నిర్ణయం ఆర్థికంగా ఎంతో ఊరటనివ్వనుంది. ఈ నూతన నిర్ణయాల ప్రకారం, నెలవారీ సీజన్ టికెట్ల జారీకి ఇప్పటివరకు ఉన్న దూర పరిమితిని టీజీఎస్ ఆర్టీసీ పూర్తిగా తొలగించింది. నిర్దేశించిన రూట్, ఛార్జీల నిబంధనలకు లోబడి, ప్రయాణికులు ఇకపై ఎలాంటి దూర పరిమితి లేకుండా నెలవారీ సీజన్ టికెట్లను పొందవచ్చు. పాస్ ధరలను మరింత తగ్గించే క్రమంలో టోల్ ప్లాజా ఛార్జీలను ప్రస్తుతం ఉన్న 25 రోజులకు బదులుగా కేవలం 20 రోజులకు మాత్రమే లెక్కించనున్నారు. అంతేకాకుండా, సాధారణ ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ ఎంపికను అందించేందుకు డీలక్స్ నెలవారీ సీజన్ టికెట్లను టీజీఎస్ ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. ఈ పాస్‌లు ‘ ఇ-డీలక్స్ ‘ సర్వీసులలో ప్రయాణానికి కూడా చెల్లుబాటు అవుతాయి.

ఇక నెలవారీ సీజన్ టికెట్ హోల్డర్లకు ప్రత్యేక ప్రయోజనంగా హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో నడిచే అన్ని కేటగిరీల సిటీ బస్సు సర్వీసులలో ఆదివారాల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటును కల్పించారు. అయితే, ఈ సౌకర్యం గ్రేటర్ హైదరాబాద్ జోన్‌ పరిధిలోని పుష్పక్ ఎయిర్‌పోర్ట్ లైనర్ సర్వీసులకు, ఇతర ప్రభుత్వ సెలవు దినాలకు వర్తించదు. అదే విధంగా ప్రయాణ సౌలభ్యం కోసం ‘ కాంబి టికెట్ ‘ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. దీని కింద ప్రతి ప్రయాణానికి అదనంగా 20 రూపాయలు చెల్లించి కాంబి టికెట్ తీసుకోవడం ద్వారా పల్లెవెలుగు మంత్లీ సీజన్ టికెట్ హోల్డర్స్ ఎక్స్‌ప్రెస్, ఇ-ఎక్స్‌ప్రెస్ బస్సులలోనూ, అలాగే ఎక్స్‌ప్రెస్ ఎంఎస్‌టీ హోల్డర్లు డీలక్స్, ఇ-డీలక్స్ బస్సులలోనూ ప్రయాణించవచ్చు. అయితే పల్లెవెలుగు పాస్‌దారులకు డీలక్స్ లేదా ఇ-డీలక్స్ బస్సులలో అనుమతి ఉండదు.

అదనంగా, తమకు నిర్దేశించిన రూట్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని ఇతర మార్గాల్లో ప్రయాణించే సీజన్ టికెట్ హోల్డర్లకు సూపర్ లగ్జరీ, అంతకంటే పైస్థాయి కేటగిరీ బస్సుల బేసిక్ టికెట్ ఛార్జీపై 10 శాతం ప్రత్యేక తగ్గింపు లభిస్తుంది. దీర్ఘకాలిక పాస్‌లు తీసుకునే వారికి ప్రోత్సాహకంగా, రెండు నెలల సీజన్ టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులకు ఎటువంటి అదనపు రుసుము లేకుండా అదనంగా 5 రోజుల వ్యాలిడిటీని, మూడు నెలల సీజన్ టికెట్ తీసుకునే వారికి అదనంగా 10 రోజుల వ్యాలిడిటీని సంస్థ కల్పిస్తోంది. అన్నింటికంటే ముఖ్యంగా మహిళా ప్రయాణికులలో సీజన్ టికెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రత్యేక రాయితీని ప్రవేశపెట్టింది. దీని కింద టోల్ ఛార్జీలతో సహా సీజన్ టికెట్ ఛార్జీలను ప్రస్తుతం ఉన్న 20 రోజులకు బదులుగా కేవలం 15 రోజులకు మాత్రమే లెక్కించనుండటంతో మహిళలకు భారీగా డబ్బు ఆదా కానుంది. ” టీజీఎస్ ఆర్టీసీతో ప్రయాణించండి – మరింత ఆదా చేయండి ” అనే నినాదంతో తీసుకొచ్చిన ఈ నూతన సౌకర్యాలను విద్యార్థులు, ఉద్యోగులు, నిత్య ప్రయాణికులందరూ గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలని సంస్థ కోరుతోంది. నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఈ సవరించిన ఎంఎస్‌టీ పథకాల ద్వారా సురక్షితమైన, పొదుపైన, సుఖవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేస్తోంది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page