బిసి రిజర్వేషన్లను 17 శాతానికి కుదించి రెడ్డి రాజ్య స్థాపనకు పూనుకున్న రేవంత్‌రెడ్డి
– బీసీ పొలిటికల్ ఫ్రంట్
బషీర్‌బాగ్, నవంబర్ 27, అద్దం న్యూస్ : 42 శాతం అమలు చేయాలని డిమాండ్ చేస్తుంటే ఉన్న 23 శాతం రిజర్వేషన్ రద్దు చేసి 17 శాతానికి కుదించి రెడ్డి రాజ్య స్థాపనకు రేవంత్ రెడ్డి పూనుకున్నాడని బీసీ పొలిటికల్ ఫ్రంట్ తీవ్రంగా విమర్శించింది. బిసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో “ ఓ బీసీ మేలుకో…నీ గ్రామాన్ని ఏలుకో…” పేరుతో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాల్‌రాజ్‌గౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, ఎస్.దుర్గయ్య గౌడ్, బోయ గోపీ, మెట్టు ధన్‌రాజ్, అంబాల నారాయణ గౌడ్, యెలికట్టే విజయ్‌కుమార్ గౌడ్, బైర శేఖర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిసి పొలిటికల్ ఫ్రంట్ ఛైర్మన్ బాల్‌రాజ్‌గౌడ్ మాట్లాడుతూ… “ జనరల్ స్థానాలను బీసీలు కైవసం చేసుకుని అగ్రకులాలను ఓడించాలి ” అని పిలుపునిచ్చారు. 46 జీవో ద్వారా బీసీలపై “ తేనె పూసిన కత్తి దెబ్బ ” కొట్టినట్లు రేవంత్‌రెడ్డి వైఖరి ఉందని ధ్వజమెత్తారు. గత రెండు సంవత్సరాలుగా జీవోలు, ఆర్డినెన్స్‌ల పేరుతో కాలయాపన చేసి, చివరకు 46 వ జీవో ద్వారా బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. 17 శాతం రిజర్వేషన్‌తో బీసీలను పక్కన పెట్టారన్నారు. రాష్ట్రంలోని మొత్తం 12,735 గ్రామపంచాయతీల్లో కేవలం 2,176 పంచాయతీలను మాత్రమే బీసీలకు ఇచ్చి, 17 శాతానికి పరిమితం చేయడం బీసీల రాజకీయ సమాధికి దారితీసే కుట్ర అని విమర్శించారు. బీసీలను బొంద పెట్టే కాంగ్రెస్‌కి గ్రామాల్లో గట్టి బుద్ధి చెప్తామని పిలుపునిచ్చారు. అగ్రకులాలను ఓడించి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు జనరల్ స్థానాల్లోనే పోటీ చేసి, ఆ స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రజలను కోరారు. బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని, కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ వెంటనే రాజీనామా చేసి బీసీ ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. 80 ఎంబీసీ కులాలను వార్డ్ మెంబర్ కాకుండా చేసిన కాంగ్రెస్‌ను శిక్షించాలన్నారు. ఈ సమావేశంలో నాగభూషణం, గోలి యాదగిరి రజక, కోయడ హర్షవర్ధన్ గౌడ్, కొంకిస సచిన్, సింగం నాగేశ్వర్ గౌడ్, చింతలబస్తీ అనిల్, బంటారం యాదగిరి, గోల్నాక సత్తయ్య గౌడ్ తదితర బీసీ నాయకులు పాల్గొన్నారు.














Leave a Reply