...

అసంఘటిత కార్మికుల రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది – మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ

అసంఘటిత కార్మికుల రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
– మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ

హైదరాబాద్, మే 18, ( అద్దం న్యూస్ ) :   రాష్ట్రంలోని 1 కోటి 27 లక్షల మంది అసంఘటిత కార్మికుల రాజ్యాంగబద్ధ హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. శ్రామిక వర్గానికి అండగా నిలిచే ఆదర్శప్రాయమైన ప్రభుత్వంగా తెలంగాణ… దేశానికి మార్గదర్శకంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. బండారు వైష్ణవ్ మెమోరియల్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో కనీస వేతనాల పెంపు కోసం నిర్వహించిన ఆల్ ట్రేడ్ యూనియన్ రౌండ్ టేబుల్ సోమ‌వారం సోమాజిగూడ ప్రెస్‌క్ల‌బ్‌లో స‌మావేశం జ‌రిగింది. ఈ స‌మావేశానికి మాజీ గవర్నర్, మాజీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… కార్మికుడు, కర్షకుడు ఇద్దరూ బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, సమాజ నిర్మాణంలో వారు ఉత్పాదక శక్తులని, తమ రక్తాన్ని శ్రమగా మార్చి రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న కార్మికులను నిర్లక్ష్యం చేయడం ఏ ప్రభుత్వానికీ మంచిది కాదని అన్నారు. ప్రత్యేకంగా అసంఘటిత రంగ కార్మికుల పరిస్థితిపై మనందరం మరింతగా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో అసంఘటిత రంగ కార్మికుల వాటా 93 శాతంగా ఉందని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో 2012 సంవత్సరం నుండి ఇప్పటి వరకు కనీస వేతనాల సవరణ జరగకపోవడం చాలా దౌర్భాగ్యకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు నాలుగు కనీస వేతన సవరణ కమిటీలు ఏర్పడినా, వాటి సిఫార్సులను ప్రభుత్వం ఇప్పటి వరకు ఆమోదించకపోవడం శోచనీయమని అన్నారు. పెరుగుతున్న ధరలు, నిత్యావసర వస్తువుల భారం, విద్యా–వైద్య ఖర్చులు, అలాగే కార్మిక కుటుంబాల్లో జరిగే శుభకార్యాల వ్యయాలను దృష్టిలో ఉంచుకొని కనీస వేతనాలను నిర్ణయించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే త్రిసభ్య ( ట్రైపార్టీ ) సమావేశాలు నిర్వహించి యాజమాన్యాలు, కార్మిక సంఘాలు, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపి కార్మికుల సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే డొమెస్టిక్ వర్కర్లకు కూడా తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి ప్రత్యేక చట్టాలు, సంక్షేమ బోర్డులు లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. 2021 జూన్ నెలలో విడుదలైన ఐదు షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లకు సంబంధించిన 21, 22, 24, 24, 25 జిఓల‌ను గెజిట్‌లో ప్ర‌చురించి అమ‌లులోకి తీసుకురావాల‌ని డిమాండ్ చేశారు. ఈ ఐదు జీవోలలో వేతనాల నిర్ణయానికి అనుసరించిన విధానాన్ని ఆధారంగా తీసుకొని, మిగిలిన 68 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్లలో కూడా కనీస వేతనాలను సవరించి వెంటనే గెజిట్‌లో ప్రచురించి అమలులోకి తీసుకురావాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి ప్రభుత్వానికి కార్మిక సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ఉండాలని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి కనీస వేతనాల సవరణను వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని బండారు దత్తాత్రేయ కోరారు. ఈ సమావేశంలో మాజీ స్పీక‌ర్‌, ఎమ్మెల్సి మధుసూదనాచారి, మాజీ కార్మిక శాఖ మంత్రి పెద్దిరెడ్డి, ఐఎన్‌టియుసి, ఏఐటియుసి, బిఎంఎస్‌, హెచ్ఎంఎస్‌, సిఐటియు, టిఎన్‌టియుసి, టిఆర్ఎస్‌కెవి, టియుసిఐ త‌దిత‌ర కార్మిక సంఘాల నాయ‌కులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.